నెల్లూరు జిల్లాపై నివర్ తుపాను ప్రభావం ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రకృతి విపత్తును ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆ మేరకు కలెక్టర్ చక్రధర్‌బాబు అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేశారు. అందరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశాలిచ్చారు. ఇస్రో, ఐఎండీ అధికారుల నుంచి కలెక్టర్ ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి.. క్షేత్రస్థాయిలో అప్రమత్తం చేస్తున్నారు. డీఈఓసీలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూము ఏర్పాటయింది. రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. పాఠశాలలు, కళాశాలలకు మూడు రోజులు సెలవు ప్రకటించారు.
ముందుకొచ్చిన సముద్రం
తుపాను ప్రభావం సూళ్లూరుపేట, తడ, శ్రీహరికోటలో కనిపిస్తోంది. షార్ తీరంలో చందరాజకుప్పం వద్ద సముద్రం ముందుకొచ్చింది. పలుచోట్ల సముద్ర తీరాల్లో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. 169 కి.మీ. సముద్ర తీరం జిల్లాకు సొంతం కాగా... ఇక్కడి 12 మండలాల్లోని 194 గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ముందుజాగ్రత్తగా స్థానికులను తుపాను రక్షిత కేంద్రాలకు తరలిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచే ఆ ప్రక్రియను మొదలుపెట్టారు.
జేసీలకు బాధ్యతలు
తుపాను సహాయక చర్యల బాధ్యతలను కలెక్టర్ ఇద్దరు సంయుక్త కలెక్టర్లకు అప్పగించారు. రెవెన్యూ జేసీ హరేందిరప్రసాద్‌కు నెల్లూరు, కావలి, ఆత్మకూరు డివిజన్ల బాధ్యతలు ఇవ్వగా, అభివృద్ధి జేసీ ప్రభాకర్‌రెడ్డికి నాయుడుపేట, గూడూరు డివిజన్ల బాధ్యతలు కేటాయించారు. వారు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సాయం కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధమయ్యాయి.
వరద నిర్వహణపై దృష్టి
ప్రస్తుతం జిల్లాలోని జలాశయాలు, చెరువుల్లో పుష్కలంగా నీరుంది. సోమశిల, కండలేరు నిండుకుండలా ఉన్నాయి. ఈ స్థితిలో వరద ప్రవాహం పోటెత్తే అవకాశం ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. పెన్నా పరీవాహకంలోని 8 మండలాల ప్రజలను అప్రమత్తం చేశారు. అవసరాన్ని బట్టి మంగళవారం నుంచే కొన్ని చోట్ల నీరు దిగువకు విడుదల చేశారు. సోమశిలలో 3టీఎంసీలు, కండలేరులో 1 టీఎంసీ ఖాళీ ఉండేలా చూడాలని కలెక్టర్ జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. చెరువులకు గండ్లు పడితే పూడ్చేందుకు వీలుగా ఇసుక బస్తాలు సిద్ధం చేశారు.
రైతుల ఆందోళన
జిల్లాలో వరిపంట కోతల సమయం కాకపోవడం కాస్త ఊరట ఇస్తున్నా.. నాట్లు, నారుమళ్లపై ప్రభావం ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యానపరంగా భారీ గాలులకు అరటి, బొప్పాయి, చీనీ, నిమ్మ తోటలు దెబ్బతినే అవకాశం ఉంటుందని అధికారులు సందేహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరూ బయటకు రావొద్దని.. పక్కా ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే టోల్‌ఫ్రీ నంబరుకు సమాచారం అందించాలని కోరారు.
ఇదీ చదవండి