కశ్మీర్ ఫైల్స్ మాదిరే మన రాష్ట్రంలో కాకాణి ఫైల్స్ సినిమా తీయవచ్చని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్క్రాప్ దొంగతనానికి వచ్చిన ఇద్దరు దొంగలను చూసి కుక్కలు మొరిగితే వారు భయపడి కోర్టు పైఅంతస్తుకు వెళ్లి తలుపులు పగులగొట్టారని నెల్లూరు జిల్లా ఎస్పీ చెప్పిన కథ నిజమై ఉండొచ్చని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
స్క్రాప్ దొంగతనానికి వచ్చిన దొంగలు కాకాణి ఫైల్స్ ఎత్తుకుపోవడమేమిటో అర్థం కావడం లేదని రఘురామ అన్నారు. భగవంతుని బలం, కొందరి స్క్రీన్‌ప్లేతో అలాంటి ఘటనలు జరగుతుంటాయన్నారు. అంబటి రాంబాబుకు గతంలో మంత్రి పదవి లేకపోయినా ‘నోటి’ పారుదల శాఖ ఉండేదని.. ఇప్పుడు నీటి పారుదల శాఖ మంత్రి అయ్యారన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో ముఖ్యమంత్రి, అంబటి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చేస్తున్న అప్పుల్లో నీటిపారుదల శాఖకు ఎంత కేటాయిస్తారో చెప్పాలన్నారు.
ఇదీ చదవండి: నెల్లూరు కోర్టులో చోరీకి పాల్పడింది.. పాత సామాన్ల దొంగలే: జిల్లా ఎస్పీ