అతన్ని విధి వెక్కిరించింది... భవిష్యత్‌ను మంచానికే పరిమితం చేసింది... వెన్నెముక విరిగిన అతడి బతుకు బండికి.. వయసు పైబడిన తల్లే ఇరుసుగా మారింది. వాళ్లిద్దరికీ ఊతకర్రలా నిలిచిన పింఛన్‌లో ప్రభుత్వం కోతపెట్టడం వల్ల తల్లీకొడుకుల తలరాత తల్లకిందులైంది.
నెల్లూరు జనార్ధనరెడ్డి కాలనీ వెంకటేశ్వరపురంలో తల్లీకొడుకులు నారాయణమ్మ, చిన్న హజరత్ నివాసం ఉంటున్నారు. 30 ఏళ్ల హజరత్ పదో తరగతి వరకూ చదువుకున్నాడు. పదేళ్ల క్రితం చెట్టెక్కి కిందపడటం వల్ల వెన్నెముక దెబ్బతింది. నడుము నుంచి కింద భాగం అంతా చచ్చుబడిపోయింది. అప్పటినుంచి మంచానికే పరిమితమయ్యాడు. హజరత్‌కు వికలాంగుల పింఛన్ వస్తుండగా నారాయణమ్మకు గతంలో వృద్ధాప్య పింఛన్ వచ్చేది. జనవరి నుంచి నారాయణమ్మ పింఛన్‌కు కోత పడింది. ఈ క్రమంలో కుటుంబం గడవడం కష్టంగా మారింది. అయినా కొడుకును బాగా చూసుకోవాలనే ఆ తల్లి ప్రేమతో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకు బండి లాగిస్తోంది. ఎవరైనా కదిలిస్తే.. కన్నీటితో కష్టాలు చెబుతోంది.
పింఛన్ కోతతో ఒక్కసారిగా కష్టాల్లో పడ్డామని... అద్దె కట్టలేక, మందులు కొనుక్కోలేక బతుకు భారంగా మారిందని తల్లీకొడుకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన పింఛన్ పునరుద్ధరించాలని నారాయణమ్మ అధికారులను వేడుకుంటోంది.
ఇదీ చదవండి: మనసులో స్థానం.. ఇంట్లోనూ సగభాగం