రాష్ట్రంలోనే మొదటిసారిగా నెల్లూరులో విద్యుత్, గ్యాస్ ఆధారిత సంచార దహన యంత్రం ప్రారంభమైంది. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ యంత్రాన్ని కరోనాతో మృతి చెందిన వారి కోసం వినియోగించనున్నారు. దాదాపు ఏడు లక్షల రూపాయల వ్యయంతో తమిళనాడు నుంచి ఈ యంత్రాన్ని తీసుకొచ్చారు. ఎక్కడికైనా సులభంగా తీసుకుపోయే ఈ యంత్రం ద్వారా ప్రతిరోజు ఐదు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించవచ్చు. మృతదేహాన్ని దహన యంత్రంలో పెట్టిన గంట తర్వాత బూడిద బయటికి వస్తుందని రెడ్ క్రాస్ నిర్వాహకులు తెలిపారు.
నగరంలోని రెడ్ క్రాస్ ఆవరణలో ఈ యంత్రాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ప్రారంభించారు. రానున్న రెండు వారాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉండటంతో అందుకు తగినట్లు చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షల్లో ప్రతి 100 మందిలో 18 మందికి పాజిటివ్ వస్తోందని వెల్లడించారు. పాజిటివ్ రేటు 18 శాతం ఉండగా.. రికవరీ రేటు 99 శాతం ఉందని, మరణాల రేటు ఒక శాతం కన్నా తక్కువగా నమోదవుతోందన్నారు.
జిల్లాలో కరోనాతో చికిత్స పొంది 30 వేల మందికి పైగా డిశ్ఛార్జ్ కావడం మంచి పరిణామమన్నారు. కుటుంబ సమస్యల కారణంగానే జీజీహెచ్ లో వృద్ధురాలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ విషయంపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇటీవల జీజీహెచ్ నుంచి పరారైన వ్యక్తి కోసం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులను బట్టి మరొక మొబైల్ దహన యంత్రాన్ని జిల్లాకు తీసుకొస్తామని రెడ్ క్రాస్ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం వచ్చిన దహన యంత్రాన్ని బోడిగాడితోట స్మశానవాటికలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: