MLA Mekapati Chandrasekhar Reddy: తనపై ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు, తదనంతర పరిణామాలపై ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. సాయంత్రం ఉదయగిరిలోని బస్‌స్టాండ్ సమీపంలోని రోడ్డు మీదకు, అభిమానులతో వచ్చిన ఆయన.. రోడ్డుపై కుర్చిలో కూర్చుని, తన వ్యతిరేక వర్గ నేతలకు ప్రతిసవాల్ విసిరారు. ఉదయగిరికి వస్తే తరుముతాామన్న వాళ్లు రావాలంటూ.. మేకపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు రావడంతో చంద్రశేఖర్ రెడ్డి మద్దతుగా స్థానిక ప్రజలు పెద్దఎత్తన తరలి వచ్చారు. నగరంలో గంటసేపు ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై ఆరోపణలు చేస్తున్న చిన్నాచితకా నేతలంతా ఒకప్పుడు తన కాళ్లకింద బతికిన వారేనని మేకపాటి విమర్శించారు.
తనపై ప్రభుత్వం విషప్రచారం చేస్తుందని మేకపాటి పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత జగన్‌కు తోడు నిలబడినందుకు తగిన ప్రతిఫలం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జగన్‌కు తోడుగా నిలబడ్డానని వైసీపీ అధికారంలోకి రావడానికి నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యే పదవికి దూర ఉన్నాని మేకపాటి తెలిపారు. తాను ఉదయగిరి ఎమ్మెల్యే నాలుగు సార్లు గెలిచానని వెల్లడించారు. తాను తప్పు చేసినందుకే.. పార్టీ తనను బహిష్కరించిందనే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మేకపాటి మండిపడ్డారు.
ప్రజలు వైసీపీని తరిమే రోజులు వస్తాయని మేకపాటి అన్నారు. తనకు సవాలు చేస్తున్న వారు దమ్ముంటే కాచుకోవాలన్నారు. తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ఒక్కసారి సైతం గెలవని వాళ్లు తనపై ఆరోపణలు చేస్తున్నారని మేకపాటి ఎద్దేవా చేశారు. సవాళ్లు విసిరితే భయపడే వ్యక్తిని కాదని ఆయన పేర్కొన్నారు.
మేకపాటి వెళ్లగానే వినయ్ రెడ్డి ప్రతి సవాల్: మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్‌కు వైసీపీ నేత వినయ్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్‌కు వచ్చిన వినయ్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. తాము లేనపుడు వచ్చి సవాల్ చేస్తారా అంటూ ఆరోపణలు చేశారు. ఇక్కడే ఉంటాం.. తేల్చుకుందాం రావాలని మేకపాటికి ప్రతి సవాల్ చేశారు.
ముందు నుయ్యి వెనుక గొయ్యి: అధికార వైసీపీకి బహిష్కృత నేతల నుంచి తలపోటు తగ్గడం లేదు. పార్టీలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయడానికి కాస్త ఆచితూచి వ్యవహరించిన వైసీపీ బహిష్కృత నేతలు పార్టీ నుంచి బయటికి వచ్చాకా విమర్శలకు పదును పెట్టారు. వారిపై కఠిన చర్యలు తీసుకుందామంటే ఇంతకాలం జరిగిన అంతర్గత అంశాలను సైతం బహిరంగ పరుస్తూ... అధికార పార్టీకి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా రాజకీయ పరిణామాలను తయారు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సైతం తాను వైసీపీ నేతలు చేసే దందాలకు అడ్డు వస్తాననే తనపై ఆరోపణలు చేశారని వెల్లడించింది. ఇక కోటం రెడ్డి మరో రెండు అడుగులు ముందుకేసి.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల నుంచి వైసీపీని శాశ్వతంగా బహిష్కరిస్తారని... ఎన్నికల్లో రాజకీయంగా సునామీ రాబోతుందని ప్రకటిస్తున్నారు. నేడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రోడ్డుపై రావడం, అనంతరం వైసీపీ నేతలకు సవాలు విసిరారు. ఇలా వైసీపీ బహిష్కృత నేతలు తలపోటుగా తయారయ్యారని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: