Cricket Dispute Minor Boy Died: స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఒకరి మృతికి కారణమైంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు లోని జాకీర్ హుస్సేన్‌నగర్‌కు చెందిన ఫరీద్ (14), ఓ బాలుడు స్నేహితులు. వారు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఫరీద్ తీరు సరిగా లేదని గుర్తించిన స్నేహితుడు అతని తల్లిదండ్రులకు చెప్పారు. తన గురించి చెడుగా చెబుతున్నాడని ఫరీద్ కక్ష పెంచుకుని నిత్యం గొడవలకు దిగి కొట్టుకునేవారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణపురంలోని ఓ పాఠశాల సమీపంలో ఉన్న క్రీడామైదానంలో క్రికెట్ ఆడుకుంటుండగా మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారు. ఫరీద్ దూషించడాన్ని జీర్ణించుకోలేని స్నేహితుడు దాడి చేశాడు.
చేత్తో మెడపై బలంగా కొట్టడంతో ఫరీద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం తెలుసుకున్న ఫరీద్ కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న బాలుణ్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతి చెందిన ఫరీద్ తండ్రి వాజిద్ ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.