పట్టు వస్త్రాలకు పేరొందిన వెంకటగిరి.. హోల్‌సేల్ వ్యాపారానికి రెండో ముంబయిగా పేరుగాంచిన కావలి.. నేత దుస్తులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన పాటూరు, నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పట్టణాల జాబితాలో ఉంటాయి. కొవిడ్ దెబ్బకు ఈ పట్టణాల కళ తప్పింది. కొనేవాళ్లు లేక అమ్మేందుకు కావాల్సిన సరుకు తెచ్చుకునే పరిస్థితి లేక.. వస్త్ర దుకాణాలు బోసిపోయాయి. పెళ్లిళ్ల సీజన్‌లోనూ వైరస్ వ్యాప్తి ఎక్కువ కావటంతో.. వస్త్ర వ్యాపారం పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిపోయింది.
నెల్లూరులో 500, కావలిలో 700 హోల్‌సేల్ వస్త్ర దుకాణాలున్నాయి. నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట, ఆత్మకూరులో మరో 5 వేల దుకాణాలు దాకా ఉంటాయి. కరోనా ఆంక్షల దెబ్బకు.. ఈ దుకాణాలన్నీ ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాయి. రిటైల్, హోల్‌సేల్ వ్యాపారమూ కొనసాగక వ్యాపారులు నష్టపోతున్నారు. తొలిసారి కరోనా వచ్చినప్పుడు దుకాణాల్లో ఉన్న సరుకే ఇప్పటికీ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతి నెల జిల్లాలో 35 కోట్ల రూపాయలకుపైగా వ్యాపారం జరిగేదని. ఇప్పుడు మొత్తం కలిపినా 50 లక్షలు దాటే పరిస్థితి లేదని వాపోతున్నారు.
నష్టాలు భరించలేక కొందరు ఐపీ పెట్టేశారు. ఇటీవల కరోనా సోకి పలువురు వ్యాపారులు మృతిచెందారు. వారి దుకాణాలు మూతపడ్డాయి. ఆయా దుకాణాల్లో పనిచేసినవాళ్లు ఉపాధి కోల్పోయారు. వస్త్రవ్యాపారంపై ఆధారపడి జిల్లాలో దాదాపు లక్ష 50 వేల కుటుంబాలు ఉన్నాయి. సైకిల్‌పై అమ్ముకునేవాళ్లు, టైలరింగ్ వ్యాపారం చేసేవాళ్లు.. మగ్గం నేతలు, కార్మికులు.. వస్త్ర పరిశ్రమపైనే ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు వీళ్లందరికీ పూట గడవటం కష్టంగా మారింది. అద్దెలు, జీతాలు చెల్లించలేక.. వడ్డీలు కట్టలేక.. ఇదివరకే అమ్మిన సరుకుకు డబ్బులు రాక.. ఎటూ అడుగువేయలేని పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు వాపోతున్నారు. కరెంట్ బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ప్రభుత్వం జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని.. వడ్డీలు మాఫీ చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకుంటే.. వచ్చే ఏడాదికి వస్త్రపరిశ్రమ పూర్తిగా దెబ్బతింటుందని వ్యాపారులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:
మద్యం అమ్మకాలకు క్యూ.. వ్యాక్సిన్ల కేంద్రాల వద్ద తోపులటా?: లోకేశ్