ప్రతి ఇంటికి సురక్షిత మంచి నీరు అందించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన జలజీవన్ పథకం కింద నెల్లూరు జిల్లాకు 287 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. వీటితో జిల్లాలో 2వేల 858 పనులకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో 5 లక్షల రూపాయల లోపు 1211 పనులు కాగా.... 5 లక్షల నుంచి 40 లక్షల రూపాయల లోపు 1788 పనులు ఉన్నాయి. ఇవి టెండర్ దశలో ఉన్నాయి. 2024 వరకు జిల్లాలో ప్రతి ఇంటికి నీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
జిల్లాలో 5 లక్షల 68 వేల గృహాలు ఉన్నాయి. ఇందులో 2.81 లక్షల ఇళ్లకు గతంలోనే కుళాయిలు ఏర్పాటు చేశారు. మిగతా 2.87 లక్షల ఇళ్లకు నల్లాలు మంజూరు చేయాలి. ఈ ఏడాదిలో లక్షా 25 వేల కుళాయిలు ఏర్పాటు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 68 వేల నల్లా కనెక్షన్లు ఇచ్చారు. మిగిలినవి త్వరలోనే పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. 2024 సంవత్సరానికి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని... ప్రజల భాగస్వామ్యంతో పూర్తిచేస్తామని.. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
నిధుల కోసం పారిశ్రామిక ప్రాజెక్టుల ఎదురుచూపులు.. నత్తనడకన పనులు