Impact of Cyclone Mandous in Rayalaseema: మాండౌస్ తుపాను ప్రభావంతో రాయలసీమ అంతటా జోరు వానలు పడుతున్నాయి. చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. నెల్లూరు సహా జిల్లాలోని పలు నగరాల్లో కాలనీలు నీట మునిగాయి. ఉమ్మడి అనంతపురం, కడప జిల్లాలోని నదులు, వాగులు పొంగి పొర్లుతుండగా..రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటపొలాల్లోకి వరద నీరు చేరింది. రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపింది.
తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు.. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి.చిల్లకూరు మండలంలో ఉప్పుటేరు వాగు ఉద్ధృతికి సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గూడూరు సమీపంలో పంబలేరు వాగు ప్రవాహానికి పంట పొలాలు నీట మునిగాయి. చిత్తూరు జిల్లా పలమనేరులోని రంగాపురం సచివాలయం పరిధిలో వర్షానికి కరెంటు స్తంభం నేలకొరగడంతో ట్రాన్స్‌ఫార్మర్ పేలింది.
ఎడతెరిపిలేని వర్షాలతో నెల్లూరు జిల్లా అతలాకుతలమైంది. నెల్లూరు నగరంలోని గుర్రాల మడుగు సంఘం ప్రాంతంలోని ఇళ్లల్లోకి వాన నీరు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంగం మండల కేంద్రంలోని కాలనీల్లోకి వరద నీరు చేరింది. సోమశిల జలాశయం నుంచి దిగువకు భారీగా నీరు వదలడంతో పరివాహక గ్రామాలు వరద ముప్పులో చిక్కుకున్నాయి.
అన్నమయ్య జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. రైల్వే కోడూరు, రాజంపేట, మదనపల్లె, రాయచోటి, పీలేరు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. మాండవ్య బహుదా, పింఛా నదుల ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కులు విడుదల చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో తుపాను ప్రభావంతో కదిరి, ఎన్పీకుంట, పుట్టపర్తి తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, పొదిలి, పెద్దారవీడు, తర్లుపాడు, కొనకనమిట్ల మండలాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. పెద్దారవీడు మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇవీ చదవండి: