Fire Accident In Nellore collectorate : నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పాత ఎన్నికల సామాగ్రి మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్ధానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రెండు వాహనాల వినియోగించి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ రోజు రెండో శనివారం కావటంతో కార్యాలయ సిబ్బంది ఎవరు విధులలో లేరు. ఎవరు లేకపోవటంతో ప్రమాద స్థాయి కొంచెం తీవ్రంగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ముందుగా గమనించి ఉంటే ప్రమాదం తప్పేదని అంటున్నారు. కలెక్టరేట్లోని ఓ గదిలో భద్రపరిచిన పాత ఎన్నికల సామగ్రి, కొన్ని దస్త్రాలు, ఫర్నిచర్ మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధం అయ్యింది.
ప్రమాదంపై స్పందించిన కలెక్టర్ : ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు స్పందించారు. అగ్ని ప్రమాదం జరిగింది పనికిరాని గోదాములో అని ఆయన స్పష్టం చేశారు. గోదాములో విద్యుత్ కనెక్షన్ లేదని.. అందువల్ల షార్ట్‌సర్క్యూట్ జరగటానికి అవకాశం లేదని వివరించారు. గోదాము పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చెత్త తగలబెట్టినట్లుగా ఉందని అన్నారు. చెత్త తగలబడటం వల్లే మంటలు చేలరేగాయని భావిస్తున్నామని తెలిపారు. కాలిపోయిన వాటిలో విలువైన దస్త్రాలేమి లేవని.. ఖాళీ బ్యాలెట్ బాక్సులే ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా పనికిరాని ఫర్నిచర్ కూడా గోదాములో ఉందన్నారు.
ఇవీ చదవండి :