ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని మిక్కిలింపేట గ్రామానికి చెందిన సుమంత్ కుమార్ రెడ్డి అనే రైతు మనస్థాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామంలోని 921, 928, 929 సర్వే నంబర్లలో 6.18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో కొంతమంది రైతులు ఏళ్ల తరబడి పంటలు సాగు చేసుకుంటున్నారు. సుమంత్ రెడ్డి ఎకరా పొలం కొనుగోలు చేసి గత పదేళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఇది ప్రభుత్వం భూమంటూ అధికారులు బోర్డు పెట్టడం, కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో సుమంత్ రెడ్డి మనస్థాపానికి గురయ్యారు. శుక్రవారం మిక్కిలింపేట గ్రామ సచివాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సుమంత్ కుమార్ రెడ్డిని... స్థానికులు నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భూమి రిజిస్ట్రేషన్ కూడా అయిందని, పాస్ బుక్‌ను సైతం అధికారులు జారీ చేసినట్లు... బాధితుడి బంధువులు తెలిపారు.
ఇదీ చదవండి: ఆటో-కారు ఢీ... ఐదుగురికి గాయాలు