నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన రైతు అశోక్.. మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరిసాగు చేశాడు. పైరు ఏపుగా ఎదిగింది. మంచి దిగుబడి వస్తుందని రైతు ఆశించాడు. వారం రోజుల్లో కోతలు కోసి.. కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలని కలగన్నాడు. ఇంతలో వర్షం అతడి ఆశలపై నీళ్లుచల్లింది. ఎడతెరిపిలేని వానలు, గాలులకు పైరు పాడైపోయింది. ధాన్యం నీటిలో నాని మొలకలు వచ్చాయి. రైతుకు కన్నీరే మిగిల్చాయి. తడిసిన ధాన్యం కొనుగోలు తీరు రైతును మరింత కుంగదీసింది. రైతుల దీనపరిస్థితి ప్రభుత్వానికి తెలసేలా.. వర్షంలోనే పొలంలో నాలుగు గంటల పాటు నిలబడి నిరసన తెలిపాడు.
ఈ విషయం తెలుసుకుని.. తహసీల్దారు, వ్యవసాయాధికారి రైతు వద్దకు రాగా వారితో గోడు విన్నవించుకున్నాడు. పంటకు పరిహారం చెల్లించాలని.. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను అశోక్ కోరాడు. వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని, నివేదిక కలెక్టర్‌కు అందించి రైతులకు పరిహారం అందేలా చూస్తామని అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా అనేక మంది రైతుల పరిస్థితి ఇదేనని... ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: కట్టడి ప్రాంతాల్లోనే విజృంభణ..