నెల్లూరు జిల్లాలో సోమశిల నుంచి ఇందుకూరు పేట మండలం వరకు పెన్నా నది విస్తరించి ఉంది. పెన్నాకు ఇరువైపులా 100కుపైగా గ్రామాలు ఉన్నాయి. వరదల నుంచి గ్రామాలను రక్షించడానికి పొర్ల కట్టలు ఎంతో సహాయపడుతున్నాయి. విడవలూరు మండలం ముదివర్తి వద్ద ఇసుక రవాణా చేస్తుండటంతో పొర్లు కట్టలు బలహీనపడ్డాయి.
ఇదే సమయంలో గతేడాది కురిసిన అధిక వర్షాల వల్ల అనంతసాగరం మండలం కచేరిదేవరాయపల్లి వద్ద కట్టలు దెబ్బతిన్నాయి. వరద ఎక్కువై కట్టలు తెగి గ్రామాలను ముంచెత్తాయి. గ్రామాలతో పాటు...ప్రజల ప్రాణాలు కాపాడే పొర్లు కట్టల పటిష్టతపై నిర్లక్ష్యం.. స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెంలో దెబ్బతిన్న పొర్లుకట్ట నిర్మాణ పనులు నాసిరకంగా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పొర్లుకట్టల మరమ్మతులకు చౌడు మట్టి వినియోగిస్తుండటంతో కట్ట బలహీనంగా మారుతుందని, వర్షాలు వస్తే మళ్లీ గండి పడే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస‌్తున్నారు.
పల్లెపాలెం నుంచి కుడితిపాలెం వరకు పెన్నా కట్ట దెబ్బతింది. రాజుపాలెం వద్ద 300 మీటర్లు కోతకు గురైంది. కోతకు గురైన ప్రాంతంలో బంకమట్టిని వినియోగించాల్సి ఉండగా.. మట్టితోపాటు ఇసుక కలిపి కట్టను నిర్మిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. నాసిరకం పనుల వల్ల కుడితిపాలెం, నిడుముసిలి, గంగపట్నం గ్రామాలకు వరద ప్రమాదం పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు. పొర్లు కట్టల పనుల నాణ్యతపై అధికారులు స్పందించకుంటే కొద్దివర్షాలకే ప్రస్తుతం వేస్తున్న పొర్లు కట్టలు కొట్టుకుపోతాయని స్థానికులు చెబుతున్నారు. అక్రమాలను నిరోధించి నాణ్యతతో పొర్లు కట్టలను నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి