CPM LEADER RAGHAVULU : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలను నకిలీ రత్నాలుగా మార్చేస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు విమర్శించారు. చిన్న చిన్న సాకులు చూపి పింఛన్లు రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కందుకూరు తెలుగుదేశం సభలో తొక్కిసలాట బాధాకరమన్న రాఘవులు.. ప్రభుత్వం రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
అంగవైకల్యం ఉన్నవారికి, భర్త చనిపోయిన వితంతువులకు వాలంటరీ వ్యవస్థ ద్వారా ధ్రువీకరణ పత్రాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దేశమంతా వ్యతిరేకిస్తున్న స్మార్ట్ మీటర్లపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంత ఆసక్తి అర్థం కావడం లేదన్నారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేది ప్రజల ప్రయోజనం కోసమా లేక కంపెనీల లాభాల కోసమా అని నిలదీశారు.
దిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసిన ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి రావాల్సిన 46 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని కోరినట్లు తెలుస్తోందన్నారు. అయితే విశాఖకు ప్రధాని వచ్చినప్పుడు ఈ సమస్యలన్నీ ముఖ్యమంత్రి ఏకరవు పెట్టినా రాష్ట్రానికి ఎలాంటి చేయూత అందలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై అర్థించటం తప్ప, ప్రశ్నించే తత్వం అధికారి పార్టీ చేయడం లేదని ఆక్షేపించారు.
ప్రధానిని కలిసిన ముఖ్యమంత్రి జగన్.. విశాఖ ఉక్కు గురించి ఎందుకు ప్రశ్నించలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రశ్నించారు. పింఛన్ల రద్దుపై ఇస్తున్న నోటీసులను వెంటనే ఉపసంహరించుకుని, దరఖాస్తు చేసుకున్న వారందరికి పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: