నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సమస్యలతో పురుగుల మందు సేవించి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు గత పది సంవత్సరాలుగా నెల్లూరులో నివాసముంటున్నాడు. చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజులుగా కుటుంబంలో సమస్యలు తలెత్తటంతో భార్య శ్రీలక్ష్మితో కలిసి సొంతురైన కోవూరుకు వచ్చారు.
అనంతరం మైథిలి హాల్ దగ్గరున్న స్మశానవాటికలో వెంకటేశ్వర్లు తల్లి సమాధి వద్ద పురుగుల మందు తాగి దంపతులిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకటేశ్వర్లు మృతి చెందగా...శ్రీలక్ష్మీకి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు..ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.