కరోనా వైరస్ ప్రభావం నిమ్మ రైతులకు శాపంగా మారింది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు పూర్తిగా పతనమయ్యాయి అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పొదలకూరు, గూడూరు, వెంకటగిరి బాలాయపల్లి, రాపూరు తదితర మండలాల్లో రైతులు ఎక్కువ శాతం నిమ్మ సాగు చేస్తుంటారు. నిమ్మకాయల బస్తా ధర 500 నుంచి 800 రూపాయల వరకు పలుకుతున్నాయని, ఈ ధరలు గిట్టుబాటు కావటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని రైతులు వాపోతున్నారు. కూలీ రేట్లు, మందులు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాన్నారు. బస్తా నిమ్మకాయలు మార్కెట్కు తరలించాలంటే రవాణా ఖర్చుతో కలుపుకొని వెయ్యి దాటుతోందని..దీంతో గిట్టుబాటు కావటం లేదంటున్నారు. ఎగుమతులు నిలిచిపోవడంతో నిమ్మ వ్యాపారులు ధరలు కూడా అమాంతంగా తగ్గిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
దిల్లీ, చెన్నై, నేపాల్ తదితర రాష్ట్రాలకు నిమ్మ ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు పూర్తిగా తగ్గాయని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ధర రైతులకు గిట్టుబాటు కావడం లేదంటున్నారు. రైతులు చేసేదేమీలేక వ్యాపారులు చెప్పిన ధరలకే అమ్ముకుంటున్నారని తెలిపారు.