జనవరికల్లా సంగం, నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. మర్రిపాడు మం. కృష్ణాపురం వద్ద సోమశిల హైలెవల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులకు సీఎం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పెన్నా నది నీటిని సద్వినియోగం చేసుకుంటున్నామని, జిల్లాలో మరిన్ని ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సీఎం అన్నారు. నీరు, వ్యవసాయం విలువ తెలిసిన ప్రభుత్వం తమదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. జలయజ్ఞం పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని వివరించారు.
పోలవరం పూర్తి చేస్తాం...
2022 ఖరీఫ్‌కు నీరిచ్చేలా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. 2020-21లో 6 ప్రాధాన్యత ప్రాజెక్టులను పూర్తిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. నీటి విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మం. కృష్ణాపురం వద్ద రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. కృష్ణాపురం వద్ద కార్యక్రమంలో మంత్రులు గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
రివర్స్ టెండరింగ్ తో ఆదా...
సోమశిల హైలెవల్ కెనాల్ రెండో దశ పనులకు గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు రూ. 527.53 కోట్లతో హడావుడిగా మొదలుపెట్టినా ఆ పనులేవీ జరగలేదని జగన్ తెలిపారు. ఈ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లి రూ.459 కోట్లకు పనుల విలువను తగ్గించి రూ.68 కోట్లు ఆది చేసిందని చెప్పారు.
ఇదీ చదవండి:
స్టేటస్ కో ఉండగానే రైతు భరోసా కేంద్రం నిర్మిస్తారా..?: హైకోర్టు