Andhra Pradesh Campus recruitmentS Updates: ఆర్థిక మాంద్యం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది క్యాంపస్ ప్రాంగణ నియామకాల్లో అనిశ్చితి ఏర్పడింది. గతేడాదితో పోల్చితే ఈసారి సాధారణ నియామకాలు 40% తగ్గిపోగా.. పెద్ద ప్యాకేజీ వేతనాలు 60% వరకు తగ్గాయి. మరోవైపు ఐటీ కంపెనీలు.. ఉద్యోగాల్లో విధిస్తున్న కోతల ప్రభావం ఫ్రెషర్స్ నియామకాలపై భారీగా పడింది. ఈ క్రమంలో ప్రస్తుతం బీటెక్ చదువుతున్న విద్యార్థులు.. కోర్స్ పూర్తయ్యేలోపు ఏయే నైపుణ్యాలను పెంచుకుంటే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించవచ్చు అనే అంశాలపై నిపుణులు పలు కీలక విషయాలను సూచించారు.
దేశవ్యాప్తంగా కరోనా తర్వాత ఐటీ నియామకాలు భారీగా పెరిగాయి. దీంతో కళాశాలలు సైతం ఈ ఏడాది ఎక్కువగా ఐటీ సంబంధిత కోర్సులనే ప్రవేశపెట్టాయి. దీంతో మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌లాంటి పలు ఇంజినీరింగ్ కోర్సులను తగ్గించేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమందికి ఉద్వాసన పలుకుతుండగా.. ఫ్రెషర్స్ నియామకాలు మాత్రం స్వల్పంగానే చేపడుతున్నాయి. ఇది 2023-24లోనూ కొనసాగే అవకాశం ఉందని.. పలు ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన ప్రాంగణ నియామకాల అధికారులు తెలిపారు.
మరోవైపు కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు.. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, మరికొన్ని మౌఖిక పరీక్షలు పూర్తి చేసినా ఇప్పటికి ఫలితాలను వెల్లడించలేదు. మౌఖిక పరీక్షలు నిర్వహించిన టీసీఎస్ కొంతమంది ఫలితాలను పక్కన పెట్టేసింది. కాగ్నిజెంట్ సంస్థ వారికి ఒప్పందాలున్న కళాశాలల్లోనే కొన్ని నియామకాలు నిర్వహించింది. విప్రో సంస్థ ఎప్పుడూ నిర్వహించే నేషనల్ టాలెంట్ హంట్ ఇప్పటివరకు నిర్వహించలేదు.
ఇక, ఇన్ఫోసిస్ ఫూల్ డ్రైవ్ నిర్వహించకపోగా.. చేపట్టిన నియామకాలనే తగ్గించింది. ఇన్ఫిటిక్యూను ఎప్పుడు నిర్వహించేదీ ప్రకటించలేదు. ఐబీఎం కొన్ని కళాశాలల్లో పెద్ద ప్యాకేజీ నియామకాలు నిర్వహించగా.. రాష్ట్రంలో టెక్ మహీంద్ర, డీఎక్స్‌సీ టెక్నాలజీ సంస్థలు పెద్దగా నియామకాలు చేపట్టలేదు. క్యాప్‌జెమినీ, మైండ్‌ట్రీలాంటి సంస్థలు గతంతో పోల్చితే నియామకాలు తగ్గించాయి. స్వయంప్రతిపత్తి కళాశాలలు, పేరున్న విద్యా సంస్థలు, ఒప్పందం ఉన్న విద్యా సంస్థల్లోనే కొంతవరకు నియామకాలు జరిగాయి.
కాగ్నిజెంట్ సంస్థ గతేడాది చేసుకున్న నియామకాల్లో కొన్నింటిని పక్కన పెట్టింది. సంస్థలు మొదట స్వల్ప మొత్తంలో నియామకాలు చేసుకోవడం, తర్వాత పరిస్థితులను అనుసరించి నిర్ణయం తీసుకోవాలనే విధానాన్ని పాటిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్‌లో అవకాశాలున్నా.. ప్రారంభ వేతనం తక్కువగా ఉంది. మెకానికల్ విద్యార్థులకు ఆటోమొబైల్‌లో అవకాశాలు ఉన్నాయి. మెకానికల్ వారు ఐఓటీ, రోబోటిక్స్, ఏఐలాంటి కోర్సులు నేర్చుకుంటే అవకాశాలుంటాయని నిపుణులు వెల్లడించారు. మెకానికల్ వారు కూడా కొందరు ఐటీ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే: ఇన్ఫోసిస్ సంస్థ శిక్షణ అనంతరం సరైన పనితీరు కనబరచని 600 మంది ఫ్రెషర్స్‌ను తొలగించింది. నియామకం పొందిన తర్వాత కంపెనీలు ఇచ్చే ఇంటర్న్‌షిప్, ఇతర శిక్షణలను నైపుణ్యంతో పూర్తి చేయాలని ప్రాంగణ నియామకాల అధికారులు వెల్లడిస్తున్నారు. ఉద్యోగాలు రాని వారు అమెజాన్ వెబ్ సర్వీసెస్, సేల్స్‌ఫోర్సులాంటి సంస్థల్లో సర్టిఫికెట్ కోర్సులను పూర్తి చేయడంతోపాటు నైపుణ్యాలను పెంచుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్, డిజిటల్ టెక్నాలజీ ప్రాజెక్టులు, కృత్రిమ మేధ, డేటా సైన్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లాంటి ప్రాజెక్టులు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు లభించని విద్యార్థులకు కళాశాలలు ప్రాజెక్టు ఆధారిత అభ్యసనను కొనసాగించాలని, పరిశ్రమ సర్టిఫికేషన్‌కు విద్యార్థులను ప్రోత్సహించాలని వెల్లడిస్తున్నారు. ఉద్యోగ పోటీ పరీక్షల్లోనూ విద్యార్థులను భాగస్వాములను చేయాలని, ఇంటర్న్‌షిప్‌లు పెంచాలని పేర్కొంటున్నారు.
కొత్తవాటిపై ఆందోళన: ''దిగ్గజ కంపెనీలు అకడమిక్స్‌తోపాటు ప్రత్యేక ప్రాజెక్టులు, సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. గూగుల్ సంస్థ అంతర్జాతీయంగా 12 వేలమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు జనవరి చివరిలో ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ 10 వేలు, అమెజాన్ 18 వేలు, మెటా 11 వేలమందిని తొలగించాయి. స్విగ్గీ 380 మందిని తొలగించింది. డెల్ టెక్నాలజీస్ సైతం 6 వేల మందికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్లు సమాచారం. చాలా కంపెనీలు గతేడాది తీసుకున్న వాటితోనే సరిపెట్టుకుంటుండగా.. కొన్ని కంపెనీలు వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తున్నాయి. 2008 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.'' అని ఏపీ శిక్షణ, ఉపాధి అధికారుల సమాఖ్య అధ్యకుడు పి.వెంకట్రావు అన్నారు.
అదనపు నైపుణ్యాలు ఖచ్చితంగా ఉండాల్సిందే: ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు రాని వారు బీటెక్ పూర్తయ్యేలోపు అదనపు నైపుణ్యాలను ఖచ్చితంగా పెంచుకోవాల్సిందేనని.. ఏపీ శిక్షణ, ఉపాధి అధికారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి సురేంద్ర తెలిపారు. కళాశాలలు సైతం ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు చేయించడంతోపాటు నియామక పోటీ పరీక్షల్లో విద్యార్థులను భాగస్వాములను చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితి మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉన్నందున.. నైపుణ్యాలున్న వారికే ఉద్యోగాలు లభిస్తాయని.. మెకానికల్, సివిల్‌లాంటి కోర్స్ ఇంజినీరింగ్ నియామకాలపై పెద్దగా ప్రభావం కనిపించడం లేదని పేర్కొన్నారు. సాధారణ డిగ్రీతో ఉద్యోగం వచ్చే అవకాశాలు తగ్గిపోయాయని.. బీటెక్ మూడో సెమిస్టర్ నుంచే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై పట్టు సాధించాలన్నారు. వాటిలో సర్టిఫికేషన్ చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, కమ్యూనికేషన్ నైపుణ్యాలతో పాటు ఇండస్ట్రీ-4.0 టెక్నాలజీపై దృష్టిపెట్టాలని వెల్లడించారు.
ఇవీ చదవండి