కరోనా కల్లోలంలో కుటుంబాలు కుదేలవుతున్నాయి. మరెన్నో కుటుంబాల్లో బంధాలు.. అనుబంధాలు మసకబారుతున్నాయి. కరోనా బారిన పడి మృతి చెందిన వారికి అయినవారే అంత్యక్రియలు చేయటానికి వెనకాడుతున్నారు. ఇటువంటి తరుణంలో.. ఓ అంధుడు ఓ వృద్ధురాలి పట్ల పెంచుకున్న ప్రేమ అందరి హృదయాలను ఆర్ద్రతతో నింపే సంఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగింది.
పట్టణంలోని ముస్లిం వీధిలో ఉంటున్న కలీల్ అంధుడు. కావలి పురపాలక సంఘంలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతిరోజు నాయుడుపేట రైల్వే స్టేషన్ నుంచి రైలులో వెళ్లి విధులకు హాజరవుతుంటారు. రైల్వే స్టేషన్ ఎదురుగా ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఓ 80 వృద్ధురాలు టీ దుకాణం నడిపేది. ప్రతిరోజూ కలీల్ వృద్ధురాలి వద్ద టీ తాగటం అలవాటుగా మారింది. మతాలు వేరైనా.. అవ్వా మనువడిగా అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమె కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న కలీల్ ఆసుపత్రికి చేరుకుని.. ఆమె మృతదేహాన్ని దూరంగా మనసుతో చూశారు. ఒక బంధువుగా బాధితురాలి కుటుంబ సభ్యులతో మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు వెళ్లారు. మానవత్వం మంటగలిసిపోతున్న ఈ రోజుల్లో కలీల్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇదీ చదవండి: మానవవత్వం చాటుకున్న డీఆర్డీవో ఛైర్మన్