Yuvagalam Padayatra in Kavali Constituency: జగన్‌కు ఇంకొక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేయడమేగాక.. ప్రజల ఇల్లు, పొలాలు సైతం దోచుకుంటాడని నారా లోకేశ్ విమర్శించారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్సీపీ అరాచక పాలనపై విరుచుకుపడ్డారు. లోకేశ్ యువగళం పాదయాత్ర నేడు 2వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది.
యువగళం పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా కావలిలో లోకేశ్ బహిరంగ సభకు.. జనం అధిక సంఖ్యలో పోటెత్తారు. సభా వేదిక చుట్టూ నాలుగు రోడ్లూ కిక్కిరిశాయి. భారీగా తరలివచ్చిన తెలుగుదేశం కార్యకర్తలను చూసి.. లోకేశ్ ఉత్సాహంగా ప్రసంగించారు. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి జగన్‌కు భయం పట్టుకుందని విమర్శించారు. జనంలో మార్పును గమనించే సీఎం అసత్య ప్రచారాలు మొదలుపెట్టారన్నారు. జగన్‌కు మరో అవకాశమిస్తే ప్రజలు వారి ఆస్తులపై ఆశలు వదులుకోవాల్సిందేనని లోకేశ్ హెచ్చరించారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు పెరిగిపోయాయని మండిపడ్డారు.
"అందరూ ఆలోచించాలి పొరపాటును ఈ సైకో జగన్‌కు ఇంకో అవకాశం ఇస్తే.. మన ఇల్లు, పొలం కూడా లాగేసుకుంటాడు. జగన్‌పాలనలో గంటకో కిడ్నాప్, పూటకో అత్యాచారం, రోజుకో హత్య. మొన్న చూశాం వైఎస్సార్సీపీలోని ఓ ఎంపీ కుంటుబాన్ని వైజాగ్‌లో కిడ్నాప్ చేశారు. అంతేకాకుండా పదో తరగతి చదువతున్న బాలికపై అత్యాచారం చేశారు. గన్ కన్నా ముందుగా జగన్ వస్తారని.. ఎన్నికలకు ముందు సైకో అన్నాడు. ఇప్పుడు ఏమైందని ప్రశ్నిస్తున్నాను." - నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
తెలుగుదేశం అధికారంలోకి రాగానే జగన్ తొలగించిన సంక్షేమ పథకాలను.. తిరిగి కొనసాగిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. కావలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తామని ప్రకటించారు. అన్ని వర్గాలకు చెందిన సంక్షేమ పథకాలన్నీంటినీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
మరోవైపు యువగళం పాదయాత్ర నేడు 2వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. ఇప్పటి వరకు 153రోజుల్లో 2వేల కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది.. 53 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగింది. 53 నియోజకవర్గాలు, 135 మండలాలు, 1,297 గ్రామాల మీదుగా సాగింది. కావలి నియోజకవర్గంలోని కొత్తపల్లిలో పైలాన్ ఆవిష్కరించనున్నారు.
సగటున రోజుకు పదమూడున్నర కిలోమీటర్ల చొప్పున నడుస్తున్న లోకేశ్.. సుమారు 30 లక్షల మందిని నేరుగా కలిశారని పార్టీ వర్గాలు తెలిపాయి. వివిధవర్గాల ప్రజలనుంచి 2,895 రాతపూర్వక వినతిపత్రాలను స్వీకరించినట్లు వివరించాయి. లోకేశ్‌కు సంఘీభావంగా నేడు తెలుగుదేశం శ్రేణులు సంఘీభావ పాదయాత్రలు నిర్వహించనున్నారు. గుంటూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేశారు.