SP surprise attack on sand reaches:పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలో నాగావళి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మెరుపు దాడి చేయడం చర్చనీయాంశమైంది. దీనిపై స్థానిక పోలీసులకూ సమాచారం లేదు. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయనే మాట వినిపిస్తోంది. పట్టుకున్న వాహనాలను పాలకొండ స్టేషన్‌కు కాకుండా జిల్లా కేంద్రానికి తరలించడం.. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఒక ట్రాక్టర్‌ను పట్టుకుంటేనే హడావుడి చేసే పోలీసులు పెద్దఎత్తున వాహనాలను స్వాధీనం చేసుకున్నా గోప్యంగా ఉంచారు. కనీసం వాహనాల ఫొటోలు కూడా తీయనివ్వకుండా పోలీసులను కాపలా పెట్టడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాహనాలన్నీ విశాఖ జిల్లాకు చెందినవిగా డ్రైవర్లు చెబుతున్నారు.
పాలకొండ నియోజకవర్గంలోని అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్య పోరే దాడులకు కారణమని తెలుస్తోంది. అక్రమ తవ్వకాలపై ఓ సంస్థ రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఎస్పీ అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసు వాహనాల్లో కాకుండా సాధారణ వాహనాల్లో మఫ్టీలో వెళ్లారు. పాలకొండ మండలం అన్నవరం రేవు వద్ద 15 లారీలు, రెండు పొక్లెయిన్లు, మూడు ద్విచక్ర వాహనాలు, 17 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని 40 మందిపై కేసులు నమోదు చేశారు. యరకరాయపురం రేవు వద్ద మరో 5లారీలు, ఒక పొక్లెయిన్, స్వాధీనం చేసుకొని 12 మందిపై కేసు పెట్టారు.
ఇవీ చదవండి: