Two Brothers Died in a Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. మృతులు చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెంకు చెందిన రమేశ్, బాలకృష్ణగా పోలీసులు గుర్తించారు. అన్నదమ్ములిద్దరూ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగం చేస్తున్నారు. సీఆర్పీఎఫ్లో ఉద్యోగం చేస్తున్న రమేశ్.. విశాఖలో విధులు నిర్వహిస్తున్నారు. నావిగేషన్ శిక్షణ కోసం చెన్నైకి వెళ్లి తిరిగి వెళ్లే క్రమంలో.. తన 6 నెలల పాపను చూసేందుకు రమేశ్ ఇంటికి వచ్చారు. ఇవాళ రమేశ్ విశాఖ వెళ్తుండటంతో రైలు ఎక్కించేందుకు తమ్ముడు బాలకృష్ణ.. బైకుపై తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఒకే ప్రమాదంలో ఇద్దరి కుమారులను పోగొట్టుకోవటంతో.. ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలనలు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం గ్రామానికి చెందిన మోపూరి చిన్నా కృష్ణ రావు, గోవిందమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారి ఇద్దరి కుమారులు.. రమేశ్(31), బాలకృష్ణ(26)లను బాగా చదివించారు. బాలకృష్ణ రైల్వేలో గేటు కీపరుగా విధుల్లో ఉన్నారు. అయితే విశాఖలో సీఆర్పీఎఫ్లో ఉద్యోగం చేస్తున్న రమేశ్.. నావిగేషన్ శిక్షణ కోసం చెన్నైకి వెళ్లారు. అయితే విశాఖకు తిరుగుపయనమయ్యే క్రమంలో ఆయన తన ఆరు నెలల కుమార్తెను చూసేందుకు రెండు రోజుల క్రితం తన ఇంటికి వెళ్లారు. కాగా ఈ రోజు ఆయనను తమ్ముడు బాలకృష్ణ.. రైలు ఎక్కించేందుకు బైక్‌పై కట్టుబడివారిపాలెం నుంచి గుంటూరుకు బయలుదేరారు. మార్గమధ్యలో తిమ్మాపురం వద్ద జాతీయ రహదారి మరమ్మతు పనులు నిర్వహిస్తుండటంతో బైక్‌ను స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు.
Accident in Konaseema: కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
అయితే అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ.. బైక్‌ను ఢీకొట్టి అన్నదమ్ములిద్దరిపై నుంచి వెళ్లిపోయింది. ఈ దారుణమైన ఘటనలో రమేశ్, బాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. మృత దేహాలను యడ్లపాడు పోలీసులు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఇద్దరి కుమారుల మృతితో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. మృతుడు రమేశ్‌కు భార్య, 6నెలల పాప ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే విధులకు బయలుదేరుతున్న సమయంలో రమేశ్ పాపను ఎత్తుకున్నాడని, ఆ సమయంలో చిన్నారి తండ్రిని విడిచిపెట్టకుండా ఏడుస్తుండగా.. బలవంతంగా ఇంట్లో అప్పగించి బయలుదేరాడని మృతుల తల్లిదండ్రులు చెప్పుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది.