Three arrested for raping killing woman in AP : పల్నాడు జిల్లాలో గిరిజన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. మహిళను హత్య చేసిన ఘటనలో పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మాచర్ల మండలం అనుపు ప్రాంతంలోని చెంచుకాలనీలో నివసించే మహిళ (40) కొన్నేళ్లుగా ఆశా కార్యకర్తగా పని చేస్తోంది. ఇటీవల ఆమె ఫోన్ పోయింది. సమీపంలో మరో కాలనీలో ఉండే వెంకన్న సాంకేతిక సమాచారంతో ఫోన్ ఎక్కడుందో చెబుతారని తెలిసి శుక్రవారం రాత్రి అతడి వద్దకు వెళ్లింది. ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉందని, తర్వాత కనుక్కుంటానని అతడు చెప్పడంతో తిరిగి ఇంటికి బయలుదేరింది. మహిళ ఉండే కాలనీకే చెందిన చిన అంజి, బైస్వామి, అంజి అనే వ్యక్తులు మార్గమధ్యలో ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి సామూహికంగా అత్యాచారం చేశారు. మహిళ కేకలు వేస్తుండటంతో రాయితో తలపై బలంగా మోదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పక్కనే ఉన్న లోతట్టు ప్రాంతానికి తీసుకెళ్లి మృతదేహంపై తాటాకులు కప్పి నిందితులు ఇళ్లకు వెళ్లిపోయారు. శనివారం ఉదయం వరకు ఎదురుచూసినా మహిళ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు విజయపురి సౌత్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం కుటుంబసభ్యులు వెతుకుతుండగా.. వారి పెంపుడు కుక్క మృతదేహం ఉన్న ప్రాంతం వద్దకు వెళ్లి మొరిగింది. అక్కడికెళ్లి తాటాకులు తొలగించగా మహిళ మృతదేహం బయటపడింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి ప్రకటించారు. నిందితులంతా 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసువారన్నారు.
రూ.10 లక్షల ప్రభుత్వ సాయం
ఈ దారుణ ఘటనను మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందించాలని సీఎం ఆదేశించడంతో ఎమ్మెల్యేతోపాటు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, గురజాల ఆర్డీవో అద్దెయ్యలు ఈ మేరకు చెక్ అందించారు.
ఇవీ చదవండి: