TDP Leaders Demanding Compensation to Farmers: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని టీడీపీ మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేెశారు. సమావేశంలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పంట నష్టం అంచనాలు వేయమని అధికారులకు ఆదేశాలిచ్చినా పట్టించుకున్న నాథుడు లేడని దుయ్యబట్టారు. నెల రోజుల తరువాత అధికారులు పంట నష్టం అంచనా వేసినా.. నష్టం ఎంత జరిగిందో తెలిసే అవకాశం ఉండదన్నారు. ఏ పంటకు ఎంత న్యాయం చేస్తారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులు అప్పు ఎలా తీర్చాలో అర్ధం కాక ఆందోళన చెందుతున్నారన్నారు.
రైతు లేకపోతే రాజ్యమే లేదన్న జగన్మోహనరెడ్డి ఇప్పుడు రైతును ఎందుకు దగా చేస్తున్నారో చెప్పాలన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మంత్రి రజని పంటనష్టంపై ఎందుకు పర్యటన చేశారో అర్థం కావడం లేదన్నారు. మంత్రి పర్యటన వలన రైతులకు ఒరిగిందేమిటని ప్రశ్నిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలెక్టర్లను వెంటబెట్టుకుని పంట నష్టంపై పర్యటించి వెంటనే పరిహారం ప్రకటించారన్నారు. రైతుకు జరిగిన నష్టంపైన మంత్రి రజని ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకు వచ్చి రైతులకు న్యాయం చేయాలని సూచించారు.
అదే విధంగా డ్రగ్స్, గంజాయికి దేశంలోని 29 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉందన్నారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఒక కాంట్రాక్టు కార్మికుని వద్ద గంజాయి పట్టుకున్నారన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఇప్పటివరకు గంజాయి, డ్రగ్స్, స్మగ్లింగ్లపై 11 కేసులు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. రాష్ట్రంలో మంచి పేరున్న విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో వైసీపీ నాయకులు గంజాయి సాగు పెంచి ఒడిశా సరిహద్దుల నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. యువత నిరుద్యోగులై మాదకద్రవ్యాలకు అలవాటు పడి ఆత్మహత్య లు చేసుకుంటున్నారని విమర్శించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అప్పులు, అరాచాకాలు, దోపిడీలు చేయడంలో ముందుందని ఆరోపించారు. పాత పథకాలకు పేర్లు మార్చుకోవడం తప్ప అభివృద్ధి చేసింది శూన్యమన్నారు. అవినీతితో లక్షల కోట్లు సంపాదించాలని సీఎం జగన్ ఒక యజ్ఞంలా పెట్టుకున్నాడని విమర్శించారు. వైఎస్సార్సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చివరి స్థానంలో ఉంటే.. విదేశాలకు డ్రగ్స్ ఎగుమతిలో మాత్రం మొదటి స్థానంలో ఉండటం గమనార్హమని అన్నారు.
"రాష్ట్రంలో జగన్మోహర్ రెడ్డి ప్రభుత్వం.. అప్పు చేయడం, అరాచకాలు చేయడం, దోపిడీలు చేయడం, అవినీతితో వేలకోట్ల రూపాయలను సంపాదించడాన్ని ఒక యజ్ఞంగా తీసుకెళ్లారు. సొంత జేబులు నింపుకున్నారు. కానీ ప్రజలకు మాత్రం చేసిందేమీ లేదు. అభివృద్ధి శూన్యం". - జీవీ ఆంజనేయులు, టీడీపీ నేత
"వర్షాల వలన నష్టపోయిన రైతులకు.. పంట నష్టం అంచనాలను ఇప్పటి వరకూ చేయలేదు. ఏ పంటకి ఎంత ఇస్తారో చెప్పలేదు. ఆత్మహత్యలే శరణ్యం అనే పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. వెంటనే నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం". - ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ నేత
ఇవీ చదవండి: