Reunited of Old Students : మనకు తెలిసిన వ్యక్తే కొద్ది రోజుల తర్వాత కనిపిస్తేనే ఎంతో ఆనందంగా పలకరించి మాట్లాడుతాం.. అదే 10 సంవత్సరాలు కలిసి చదువుకొని ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ఎవరి గమ్యంలో వారు వెళ్లి మళ్లీ 34 ఏళ్ల తర్వాత ఒక్క చోట కలిసిన వారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఆత్మీయ సమ్మేళనంతో అందరూ ఒక్క చోట కలిస్తే ఇక ఆ ఆనందానికి అవధులుండవు.. ఇక అసలు సంగతి చెప్పాలంటే..
పల్నాడు జిల్లా యడ్లపాడు లూధరన్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాదాపు 34 ఏళ్ల తర్వాత కలిసిన వారంతా ఉల్లాసంగా..ఉత్సాహంగా గడిపి, సందడి చేశారు. 1988–89 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 71 మంది ఉండగా అందులో 40మందికి పైగా హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో స్థిరపడిన వారంతా పాఠశాలకు విచ్చేశారు. ముందుగా ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.
తమతో కలిసి చదివిన ఐదుగురు స్నేహితులు చనిపోయిన విషయం తెలుసుకుని వారి ఆత్మలకు శాంతి కలగాలని మౌనం పాటించి, నివాళి అర్పించారు. అనంతరం పాఠశాలలో చదువుకున్న నాటి కబుర్లు చెప్పుకున్నారు. మరలా సెక్షన్‌ల వారీగా విడిపోయి క్లాస్‌రూంలోకి వెళ్లి విద్యార్థుల్లా మారారు. అప్పటి గురువుల బోధనల్ని గుర్తు చేసుకున్నారు. గ్రౌండ్‌లోకి వెళ్లి క్రీడాకారుల్లా మారారు. పలు ఆటలను ఉత్సాహంగా ఆడారు. అలాగే అలనాటి సంగతులను నెమరేసుకొని..సంతోషంగా గడిపారు. భవిష్యత్తులో ఆత్మీయ సమావేశాలను పెట్టాలని, పాఠశాల అభివృద్ధి కోసం తమ బ్యాచ్‌లో వారందరూ ఒకే వాట్సాప్ గ్రూప్‌లో ఉండాలని. ఒకరినొకరు సహాయ కార్యక్రమాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పాఠశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలు, పాఠశాలలో చదివిన మిగిలిన విద్యార్థులను సమన్వయం చేయాలనే విషయాలను చర్చించి వాటిని అమలు చేయాలని మాట్లాడుకున్నారు. ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఆటల పోటీలు, పాటల పోటీలు నిర్వహించి, ఆయా పోటీల్లో గెలిచిన వారికి బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పూర్వ విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా డీఈవో పి సుశీంద్రరావు, పులిచింతల ప్రాజెక్టు జనవనరులశాఖ డీఈఈ అజిత్, పల్నాడు జిల్లా నరసరావుపేట జలనవనరుల శాఖ జేఈఈ లక్ష్మినారాయణ, హైదరాబాద్‌లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న వలేటి అనుపమ, దండా ప్రసాద్, ముత్తవరపు సుబ్బారావు, నాగచౌదరి, పోపూరి వెంకట్రావు, అనంతలక్ష్మి, దొడ్డ రోశయ్య తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
ఇవీ చదవండి: