Masonry Inscription: పల్నాడు జిల్లా కొండవీడు కోటలో ఉన్న యోగివేమన మండపం అభివృద్ధిలో భాగంగా అటవీ శాఖ సిబ్బందితో కొలతలు వేయిస్తూ ఉండగా తాజాగా ఒక శాసనాన్ని గమనించారు. ఇంకా ఏమైనా శాసనాలు ఉన్నాయా అని పరిశీలించగా మరో మూడు శాసనాలను గమనించినట్లు కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి తెలిపారు. ఇప్పటికీ మొత్తం నాలుగు శాసనాలు గుర్తించామని, ఈ నాలుగు శాసనాలు కూడాపై కప్పుకి ఏర్పాటు చేసిన సీలింగ్ బండలకే ఉన్నాయని తెలిపారు. యోగి వేమన మండపం క్రీస్తు శకం 17, 18 శతాబ్దాలలో హైదరాబాద్ కుతుబ్సాహీల నిజాం షాహీలు కాలంలో నిర్మించి కొండవీడుకు తెచ్చినట్లుగా తెలుస్తోంది. యోగి వేమన మండప నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు మొత్తం కూడా నాటికే శిథిలమైన దేవాలయాల మండపాలకు ఉపయోగించిన పై కప్పురాళ్లు, స్తంభాలు, బండలని తెలుస్తోంది. కనుగొన్న శాసనాలను వెంటనే భారత పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ మునిరత్నం రెడ్డికి పంపించారు.
లభ్యమైన శాసనాల్లో మొదటి శాసనం విశ్వేశ్వర దేవర కళ్యాణ మండపానికి సంబంధించి కప్పును ఏర్పాటు చేయటం కోసం తయారు చేసిందని తెలిసింది. రెండవ శాసనం బండ దాదాపు సగానికి పగిలిపోయి ఉంది. దొరుకుతున్న సమాచారాన్ని బట్టి దీన్ని చేయించిన వారు తమ తల్లిదండ్రుల పుణ్యార్ధము దేవునికి నిర్మాణం చేసినట్లు ఉంది. మూడవ శాసనం కూడా తమ తల్లిదండ్రుల పుణ్యం కోసం దానం ఇస్తూ వేయించారని తెలుస్తోంది. ఈ శాసనంలో పాలడుగు బాచిన తన తండ్రి అనుమతికి తల్లికి పుణ్యంగా చేయించినట్లు చెప్పబడింది. కొండవీడులో అనేక నిర్మాణాలు శిథిలమై ఉన్నాయి. కోట పైభాగంలో దాదాపు నాలుగైదు కిలోమీటర్ల చదరపు ప్రాంతం ఉంది.
ఈ శిథిల దేవాలయాల్లోనూ ఈ మైదాన ప్రాంతంలోనూ ఆర్కియాలజీ శాఖ తవ్వకాలు నిర్వహిస్తే ఎంతో సమాచారం దొరుకుతుందని రెండు రోజుల్లో బయటపడ్డ నాలుగు శాసనాలు మనకు తెలియజేస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ ఈ విషయం మీద దృష్టి పెట్టి తక్షణమే తవ్వకాలు నిర్వహించి రాతి బండల మీద నిక్షిప్తమైన శాసనాలను భూమి పొరల్లో దాగున్న చారిత్రక విషయాలను వెలికి తీయవలసిందిగా కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి