YSRCP Leaders Illegal Sand Mafia : రాష్ట్రంలో ఏ నదిలోనూ ఓపెన్ రీచ్‌లలో తవ్వకాలకు అనుమతులు లేవు. అయినా దర్జాగా ఇసుక వ్యాపారం చేస్తున్న అధికార పార్టీ ముఖ్య నేతలకు చెందిన గుత్తేదారు ఇప్పుడు బాట ఛార్జీల పేరిట మరో దోపిడీకి సిద్ధమయ్యారు. ఇసుక లోడింగ్‌కు వచ్చే ప్రతి వాహనదారుడు కచ్చితంగా బాట ఛార్జీ చెల్లించాల్సిందేనని శనివారం నుంచి దీనిని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అనేక రీచ్‌లలో లారీల యజమానులకు ఇప్పటికే ఈ సమాచారం చేరవేశారు. దీంతో ఇసుక రవాణా చేసే లారీలు, ట్రాక్టర్ల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ఇదేం దందా అంటూ మండిపడుతున్నారు.
Illegal Sand Mafia in AP : రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలు, విక్రయాల టెండర్లు తెలంగాణకు చెందిన ప్రతిమ ఇన్‌ఫ్రా, రాజస్థాన్‌కు చెందిన జీసీకేసీ అనే సంస్థ దక్కించుకోగా, వీటి పేరిట అధికార పార్టీ ముఖ్య నేతల కనుసన్నల్లో ఇసుక వ్యాపారం గతనెల నుంచి మొదలైంది. ఇప్పుడు వారు రీచ్‌లలో టన్ను ఇసుకకు 475 రూపాయల చొప్పున ధరతో పాటు లోడింగ్‌కు వచ్చిన ప్రతిసారీ బాట ఛార్జీ చెల్లించాలంటూ హుకుం జారీ చేశారు.
ట్రాక్టర్‌కు 500, ఆరు టైర్ల లారీకి 1,000 రూపాయలు, పది టైర్ల లారీకి 1,500, పన్నెండు టైర్ల లారీకి 2వేల రూపాయల చొప్పున ఖరారు చేశారు. ఈ నెల 20 నుంచి దీనిని అమలు చేస్తున్నామని, బాట ఛార్జీ చెల్లించే వాహనాలకే ఇసుకను లోడ్ చేస్తామని చెబుతున్నారు. ఈ మేరకు ఆయా రీచ్‌లలో ఇసుక లోడింగ్‌కు వచ్చిన వాహనదారులకు ఛార్జీల వివరాల్ని తెలిపే పత్రాల్ని ఇస్తున్నారు.
గోదావరి తీరంలో ఇసుక తోడేళ్లు - గడువు పూర్తైనా యథేచ్ఛగా ఇసుక దందా
Illegal Sand Mining : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో నిత్యం సుమారు వెయ్యి లారీల ఇసుక రవాణా అవుతుంది. ఇసుకను తీసుకెళ్లే వాహనాల నుంచి రోజుకు 15 నుంచి 20 లక్షల చొప్పున, నెలకు 4.5 కోట్లు నుంచి 6 కోట్ల రూపాయల దాకా వసూలు చేయాలని తలపెట్టారు. రాష్ట్రమంతటా దీనిని అమలు చేసేలా రీచ్‌లలో నిర్వాహకులకు ముఖ్య నేత నుంచి ఆదేశాలొచ్చినట్లు తెలిసింది. అంటే ఈ బాట ఛార్జీల దోపిడీ భారీగా ఉండనుంది.
ఇప్పటికే కిరాయిలు గిట్టుబాటు కావడంలేదంటూ ఇసుక రవాణా వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా బాట ఛార్జీల పేరిట అదనపు భారం వేయడంపై మండిపడుతున్నారు. కొత్తగా బాట ఛార్జీలు ఎందుకు వసూలు చేస్తారు? అని లారీ డ్రైవర్ ఎవరైనా రీచ్‌ల నిర్వాహకుల్ని ప్రశ్నిస్తే ఇసుక కాంట్రాక్ట్ పొందిన కంపెనీ నష్టాల్లో ఉందని చెబుతున్నారు. దానిని సర్దుబాటు చేసుకునేందుకే ఈ ఛార్జీలని బదులిస్తున్నారు. రాష్ట్రమంతటా ఎక్కడా ఒక్క ఓపెన్ రీచ్‌కూ అనుమతులు లేకుండా ఇసుకను తవ్వేస్తూ, సరైన లెక్కలు చూపకుండా సొమ్ము దోచేస్తున్న ముఖ్య నేతలు నష్టాలొస్తున్నాయంటూ ఎలా చెబుతారని లారీల యజమానులు ప్రశ్నిస్తున్నారు.
బాట ఛార్జీల వసూళ్ల అమలును ఆపాలంటూ ఉమ్మడి గోదావరి జిల్లాల లారీల యజమానుల సంఘం అధ్యక్షుడు రావూరి రాజా, తదితరులు తాడేపల్లిలో గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసానికి వచ్చారు. మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. గురువారం కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికీ బాట ఛార్జీల కాపీని అందించి, అమలును ఆపేలా చూడాలని కోరారు. అయినప్పటికీ ఎవరి నుంచీ సరైన హామీ లభించలేదని తెలిసింది. దీనిపై గనులశాఖ అధికారులెవరూ నోరెత్తడం లేదు. ఇది పెద్దోళ్ల వ్యహారమంటూ మాట్లాడేందుకు భయపడుతున్నారు.
Illegal Sand Mining in Krishna River: కృష్ణాతీరంలో ఇసుక తవ్వకాలు.. కొండలను తలపిస్తున్న ఇసుక డంపులు