YCP attack on Rameza: విజయవాడ రాణిగారితోటలోని.. తారకరామానగర్‌లో ఒంటరి మైనార్టీ మహిళ ఎస్కే రమీజాపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన ఘటనలో పోలీసులు నిందితులను వదిలేసి.. బాధితులపైనే కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. బాధితురాలు రమీజా సహా ఆమెకు మద్దతుగా నిలిచినవారు, సంబంధీకులు 15 మందిపై మూడు సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు సమాచారం. తన ఇంటిపైకి వచ్చి మరీ వైసీపీ శ్రేణులు దాడిచేశాయంటూ బాధితురాలు రమీజా పోలీసులకు ఫిర్యాదు చేయగా దానిపై మంగళవారం రాత్రి వరకు అసలు కేసే నమోదు చేయలేదు.
వైసీపీ మాజీ కార్పొరేటర్ దామోదర్, బచ్చు మాధవి, భూలక్ష్మి, దేవి, చిన్నారితోపాటు 15 మంది తనపైనా, ఇంటిపైనా దాడి చేశారంటూ రమీజా ఫిర్యాదు చేశారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. ఇంత పెద్ద వివాదానికి దారితీసిన ఈ కేసుల విషయాన్ని పోలీసులు బయటపెట్టకుండా గోప్యంగా ఉంచుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
20 మంది వైసీపీ మహిళా కార్యకర్తల దాడి: విజయవాడ రాణిగారితోటకు చెందిన పేద ముస్లిం మహిళ రమీజా నాలుగేళ్ల క్రితం భర్త చనిపోవడంతో పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన మద్దతురాలిగా ఉన్న రమీజా ఆయన వైసీపీలో చేరాక కూడా ఆయన వెంటే ఉన్నారు. పింఛన్ ఇప్పించమని ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోవడంతో కలత చెందారు.
సోమవారం గడపగడపకు కార్యక్రమానికి దేవినేని అవినాష్, స్థానిక నేతలు రావడంతో రమీజా వారిని పింఛన్ సమస్యపై నిలదీసింది. మంగళవారం ఉదయాన్నే కార్పొరేటర్ రామిరెడ్డితోపాటు 20 మంది వైసీపీ మహిళా కార్యకర్తలు రమీజా ఇంటిపైకి వచ్చి దాడి చేశారు. ప్రశ్నించిన పొరుగువారిని, బంధువులను, ఇంట్లో ఉన్న చిన్నారులపైనా దాడికి పాల్పడ్డారు. సామగ్రి ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు.
మా ఇంటిపై దాడి జరిగిన తర్వాత పోలీసులు వచ్చి నాతో పాటు ఫాతిమా, శైలు, అమీరా, సునాభిని కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. మేము ఎవరిపైనా కేసు పెట్టేందుకు సిద్ధంగా లేమని వేడుకున్నా ఇప్పుడే పంపిస్తామని చెప్పి బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఉదయం 9 గంటల సమయంలో తీసుకెళ్లి రాత్రి 7 గంటల వరకూ మమ్మల్ని స్టేషన్‌లోనే ఉంచారు. ఫిర్యాదు ఇచ్చినా మధ్యాహ్నం వరకూ తీసుకోలేదు. తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మహన్ వచ్చి పోలీసులను నిలదీయడంతో ఆ తర్వాతే ఫిర్యాదు తీసుకున్నారు. కానీ ఈ ఫిర్యాదుపై రాత్రి వరకూ ఎలాంటి కేసూ నమోదు చేయలేదు. దేవినేని ఉమామహేశ్వరరావు, వంగలపూడి అనిత సహా పలువురు టీడీపీ నాయకులు స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగిన తర్వాతే మమ్మల్ని పోలీసులు వదిలారు.-రమీజా, బాధితురాలు
పలు సెక్షన్ ల కింద కేసు నమోదు: బాధితురాలు రమీజాకు సంబంధించిన 15 మందితోపాటు మరికొందరు తమపై దాడి చేశారంటూ గుణదలకు చెందిన బేతాల సునీత అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం పోలీసులు వెంటనే స్పందించి బాధితులపైనే కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. తారకరామానగర్‌లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించేందుకు మంగళవారం తనతోపాటు వచ్చిన వైకాపా కార్యకర్తలు బచ్చు మాధవి, ఇందుపల్లి సుభాషిణి, రత్నకుమారి, స్థానిక వాలంటీర్ గంజి సునీతకుమారిపై స్థానికులు దాడి చేశారంటూ సునీత.. ఫిర్యాదు చేశారు.
బాధిత మహిళ రమీజాకు మా పార్టీ అండగా ఉంటుంది. ప్రతి నెలా 3 వేల రూపాయలు పింఛన్‌గా అందజేస్తా. -గద్దె రామ్మోహన్, టీడీపీ ఎమ్మెల్యే
హోమ్‌నాథ్, దుర, శైలు, రసూల్, సుల్తానా, ఫాతిమా, రమీజా, అమీర, శిరీష, మున్న, సునాభితోపాటు ఆమె కుటుంబసభ్యులు, సాగర్, రాయి రంగమ్మ, మరికొందరు తమపై దాడికి పాల్పడినవారిలో ఉన్నారని సునీత పేర్కొన్నారు. వీరంతా కలిసి తమను అడ్డగించి కులం పేరుతో దూషించి.. కర్రలు, పూల కుండీలతో దాడి చేశారని తెలిపారు. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు రమీజా సహా 15 మందిపై 341, 324, 506 ఎస్సీ-ఎస్టీ యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. కానీ దీనిపై పోలీసులు ఎలాంటి సమాచారం బయటపెట్టలేదు. ఇరువర్గాలపైనా కేసులు నమోదు చేశామని మాత్రమే చెబుతున్నారు.
బాధిత మహిళలకు బాసట: ప్రతి ఎన్నికల్లోనూ వైకాపా నాయకుల వెంట కాళ్లరిగేలా తిరిగి ప్రచారం చేసినందుకు ప్రతిఫలంగా తమపైనే దాడి చేశారంటూ రాణిగారితోటకు చెందిన మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంతా ఏకమై బాధిత మహిళలకు బాసటగా నిలిచారు. సమస్యలు తీర్చలేనప్పుడు ఇంటింటికీ తిరగడం ఎందుకని మండిపడుతున్నారు.
ఇవీ చదవండి