Vijayawada engineering workers fire on YSRCP govt: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతూ.. తమకు తీరని అన్యాయం చేస్తున్నారని.. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో విధులు నిర్వరిస్తున్న 300 మంది ఇంజనీరింగ్ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి.. డ్రైనేజీ కాలువలు, తాగునీటి సరఫరా, పార్కుల సుందరీకరణతో పాటు క్లాప్ ఆటో డ్రైవర్లుగా రాత్రి, పగలు శ్రమిస్తుంటే.. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో తమకు కోతలు విధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర వేతనాలు సరిపోక కుటుంబ పోషణ కష్టమవుతోందని వాపోతున్నారు. నిత్యమూ ప్రమాద అంచుల్లో పని చేస్తున్న తమకు.. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి హెల్త్, రిస్క్ అలవెన్సులు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేస్తోంది.. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో దాదాపు 300 మంది ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారు. వారంతా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విభాగంలో కొన్ని ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అందులో కొంతమంది నగరానికి తాగునీటి సరఫరా, మరికొంతమంది అండర్ గ్రౌండ్ పరిశుభ్రత, తక్కినవారూ పార్కుల సుందరీకరణతో పాటు క్లాప్ ఆటో డ్రైవర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతినిత్యం ప్రజారోగ్యం కోసం శ్రమిస్తున్న తమకు.. జగన్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఆగ్రహిస్తున్నారు. తమను ఆరోగ్య విభాగంలో చేర్చకుండా నానా తిప్పలు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. హెల్త్ విభాగంలో పని చేస్తున్న వారిగా తమను పరిగణించకపోగా.. హెల్త్, రిస్క్ అలవెన్సులను అమలు చేయటంలేదని మండిపడుతున్నారు.
పర్మినెంట్ చేస్తానని.. అవస్థలకు గురి చేస్తున్నారు.. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగర పాలక సంస్థల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వారిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా ఇప్పటికీ రెగ్యులర్ చేయలేదని కార్మికులు వాపోయారు. జగన్ పాలనలో గత 25 సంవత్సరాలుగా విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు కూడా అమలు కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. పారిశుద్ధ్య రంగంలో వాహనాల మరమ్మతులు చేస్తున్న మెకానిక్ కార్మికులు.. రూ.13 వేల నుంచి రూ.17 వేల వేతనాలకి పని చేస్తున్నారని తెలియజేశారు.
న్యాయం చేయకపోతే..ఉద్యమం చేస్తాం.. పార్కుల సుందరీకరణ కార్మికులుగా పని చేస్తున్న వారు.. నిత్యమూ నగరంలో కాలువ గట్లపై పని చేస్తుంటారని.. పని చేస్తున్న సమయంలో పాములు, విద్యుత్ తీగలు తగిలి గాయపడుతుంటారని కార్మికులు గుర్తు చేశారు. విధి నిర్వహణలో గాయపడిన వారిని ఆదుకునే నాథుడు గానీ, నష్ట పరిహారం చెల్లించే అధికారులు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు హెల్త్ అలవెన్సుల, రిస్క్ అలవెన్సుల సౌకర్యం లేక.. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందక.. నానా అవస్థలు పడుతున్నామని కార్మికులు పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే.. తమకు మేలు జరుగుతుందని భావించి, ఓట్లు వేసి గెలిపిస్తే.. తమకు తీరని అన్యాయాన్ని చేస్తున్నారని ఇంజనీరింగ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్, ఉన్నతాధికారులు స్పందించి.. ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తన్న కార్మికులకు సంక్షేమ పథకాలను వర్తింపచేసి.. అన్ని రకాల అలవెన్సులు, జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన బాట పడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
''మాకు మొత్తం రూ.13వేల జీతం వస్తోంది. అందులో ఇంటి అద్దె కట్టుకోలేము. పిల్లలను బడిలో చేర్పించుకోలేము. కరెంట్ బిల్లు కట్టలేక నానా అవస్థలు పడుతున్నాము. గతంలో జగన్ మా పార్టీ గెలిచాక మమ్మల్ని పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటికీ ఆ హామీ నేరవేరలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి.. మా కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతున్నాం.''-ఇంజనీరింగ్ కార్మికులు, విజయవాడ