Vijayawada Canals Turning into Sewers: ఆంధ్రప్రదేశ్‌లో సాగు, తాగునీరు అందించే ప్రధాన కాలువలు వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ప్లాస్టిక్, ద్రవ వ్యర్థాలను ప్రజలు కాల్వల్లోకి వదలడంతో మురికికూపాలుగా మారుతున్నాయి. వ్యర్థాల కారణంగా నీటి పారుదల కాలువలు కాలుష్య కాసారాలుగా తయారవుతున్నాయి. ప్రధానంగా విజయవాడ నగరం నుంచి ప్రవహిస్తున్న మూడు ప్రధాన నీటి కాలువల పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా కాలువల్లోకి మురుగు, వ్యర్థాలు చేరుతుండడంపై స్థానికులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి మురుగునీరు, వ్యర్థాలు కాలువల్లోకి చేరుకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వ్యర్థాలతో నిండిపోతున్న కాలువలు: విజయవాడ నగరం మధ్య నుంచి వెళ్తున్న ప్రధాన కాలువలకు సంబంధించి అధికారులు ఎన్నిసార్లు చర్యలు చేపట్టిన సత్ఫలితాలు రావడం లేదు. మేజర్ అవుట్‌ఫాల్స్ నుంచి మురుగు నీరు, వ్యర్థాలు చేరుతుండడంతో రోజురోజుకీ కాలువలు మురుగుకూపాలుగా మారుతున్నాయి. దీంతో మేజర్ డ్రైయిన్స్‌లో సిల్ట్ పాయింట్స్ ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
పరిశ్రమల కాలుష్యంతో నంద్యాల సతమతం-చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
ప్లాస్టిక్, ద్రవ వ్యర్థాలతో మురుగుకూపాలుగా కాలువలు: విజయవాడ నగరం మధ్య నుంచి వెళ్లే ప్రధాన కాలువల ద్వారా దిగువ ప్రాంతాల్లోని లక్షలాది ఎకరాలకు సాగు, వేలాది మందికి తాగునీరు అందుతోంది. అయితే, ప్లాస్టిక్‌లు, ద్రవ వ్యర్థాలను ప్రజలు కాల్వల్లో వేయడంతో అవి మురుగుకూపాలుగా మారుతున్నాయి. ఈ మూడు కాలువలు ఏలూరు కాలువ ప్రకాశం బ్యారేజీ నుంచి మొదలై రైల్వే క్వార్టర్స్, పూర్ణానందంపేట, పెజ్జోనిపేట, కేదారేశ్వరిపేట, రామకృష్ణాపురం, అజిత్‌సింగ్ నగర్, గాంధీనగర్, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల వరకూ వెళ్తున్నాయి.
పోగవుతున్న వ్యర్థాలు-ఆందోళనలో స్థానికులు: సుమారు ఏడు కిలోమీటర్ల వరకూ ఈ కాలువల్లోకి 18 అవుట్ ఫాల్స్ నుంచి మురుగునీరు చేరుతుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. బకింగ్‌హాం పేట, గవర్నర్ పేట, లబ్బీపేట, పటమటలంక నుంచి వెళ్తున్న బందరు కాలువలో 5 అవుట్ ఫాల్స్ నుంచి ఘన వ్యర్ధాలు పోగవుతున్నాయని వాపోతున్నారు. హనుమాన్‌పేట, బావాజీపేట, దుర్గాపురం, పాతబస్టాండు, చుట్టుగుంట, గుణదల ప్రాంతాల నుంచి వెళ్తున్న రైవస్ కాలువలో 8 మేజర్ అవుట్ ఫాల్స్ నుంచి మురుగు చేరుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవుట్ ఫాల్ డ్రైయిన్‌లో సిల్ట్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నట్లు విజయవాడ నగరపాలక మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. అయితే, ఆలోచన మంచిదే అయినా ఆచరణలో మాత్రం అనుకున్న ఫలితాలు రావడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.
సిల్ట్ పాయింట్లు ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండదు: ''కాలువల పరిశుభ్రతకు అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కాలువల్లో కలుస్తున్న వ్యర్థాలను మాత్రం ఆపలేకపోతున్నారు. భూగర్భ మురుగునీటి వ్యవస్థతో కొంతమేర మురుగు తగ్గుతుంది. ఓపెన్ డ్రైయిన్లు, కాలువల్లో పూడికలు తీయకుండా సిల్ట్ పాయింట్లు ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండదు.'' అని విజయవాడ నగర ప్రజలు పేర్కొన్నారు.
డంపింగ్ యార్డును తలపిస్తున్న ధవళేశ్వరం- పట్టించుకోండి మహాప్రభో!