Vangalapudi Anitha Angry on Social Media Posts: తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత,.. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నేతృత్వంలో నందిగామకు చెందిన కె. సజ్జనరావు ఇంటిని తెలుగు మహిళలు చుట్టుముట్టారు. సజ్జనరావు ఇంటి వద్ద నిరసనకు దిగారు. సజ్జనరావు ఇంట్లో లేకపోవడంతో, అతని భార్య, తల్లికి అసభ్యకర పోస్టులు చూపించారు. సాటి మహిళలుగా సహిస్తారా అని ప్రశ్నించారు.
"గజ్జికుక్కల్లా పడుతున్న ఈ పేటీఏం బ్యాచ్‌కి బుద్ధి చెప్పాలి అని అనుకున్నాం. డీజీపీ ఆఫీసుకు వెళ్తే మాకు న్యాయం జరగదు. ఎస్పీ ఆఫీసుకు పోతే న్యాయం జరగదు. పోలీసు స్టేషన్లకు వెళ్తే మా ఫిర్యాదులు తీసుకోరు. కాబట్టి మా ఆత్మ రక్షణ గురించి, అలాగే మా ఆత్మ విశ్వాసం పెంపొందించుకోవడానికి.. మా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి మేమే ఈరోజు పోరుబాట పట్టాం. ఆ పోరుబాటలో భాగంగానే ఈరోజు సజ్జనరావు ఇంటికి రావడం జరిగింది. ఎవరైనా సజ్జన రావు ఉన్నారో.. అతను సూర్య అనే ఒక పీడీఎఫ్ పేపర్ నడుపుకుంటూ.. వెయ్యి రూపాయలకు, 5వేల రూపాయలకు ఒక ఆడపిల్ల మీద నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నాడు. అతన్ని ఇలాగే వదిలేస్తే.. రోజుకో మహిళ మీద పోస్టులు పెడతాడు"-వంగలపూడి అనిత, తెలుగు మహిళా అధ్యక్షురాలు
సజ్జనరావు రాతలు చూడడంటూ.. ఇంటి చుట్టు పక్కల మహిళలకు కూడా తెలుగు మహిళలు చూపించారు. సజ్జనరావు క్షమాపణలకు డిమాండ్ చేశారు. సజ్జనరావుకు ఫోన్ చేసిన అనిత ఇంటి వద్దకు రావాలని డిమాండ్ చేశారు. అది వేరే వ్యక్తి రాసిన పోస్టు అని, తనకు సంబంధం లేదని సజ్జనరావు చెప్పుకొచ్చారు. సజ్జనరావు ఇంటి ముందు మహిళలు అతని ఫొటోలు తగలపెట్టారు.
"భువనమ్మ గురించి అసెంబ్లీలో మాట్లాడితేనే దిక్కులేదు. పవన్ కల్యాణ్ భార్య గురించి మాట్లాడుతారు. మా గురించి మాట్లాడుతారు. ఈసారి ఎవరైనా మాట్లాడితే చెప్పుతోనే సమాధానం చెప్తాం. ఈ పోస్టులు అంతటికి కారణం సజ్జల భార్గవ రెడ్డి. అతను భారతీరెడ్డి అనుచరుడు.. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు. సజ్జల భార్గవ్‌రెడ్డి వైసీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్‌గా తీసుకున్నప్పటి నుంచే ఆడవాళ్లపై ఇలాంటి అఘాయిత్యాలు విపరీతంగా పెరిగాయి."-వంగలపూడి అనిత, తెలుగు మహిళా అధ్యక్షురాలు
అంతకముందు.. రాష్ట్రంలో మహిళల్ని కాపాడాలంటూ తెలుగు మహిళలు ఇంద్రకీలాద్రి వద్ద విజయవాడ కనకదుర్గమ్మకు కొబ్బరికాయలు కొట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. మహిళల జోలికొస్తే ఉపేక్షించబోమని చెప్పులు చూపిస్తూ ర్యాలీ చేశారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి,.. డీజీపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ వాళ్లు పెట్టే పోస్టులపై పోలీసులు ఎందుకు స్పందించరని అనిత నిలదీశారు.