government office was locked for rent: ఎవరైనా తమకు అన్యాయం జరిగితే ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్తారు. అదే ప్రభుత్వాధికారుల వల్లే అన్యాయం జరిగితే..! ఎవరికి చెప్పుకోవాలి... అలా ఎవరికి చెప్పుకోవాలో, ఎవరిని ప్రశ్నించాలో తెలియక మీడియాను ఆశ్రయించారు.. ఆ భవన యజమాని. తనకు చెల్లించాల్సిన అద్దెను చెల్లించి ప్రభుత్వానికి చెందిన వస్తువులను తీసుకెళ్లాలని భవనం యజమాని డిమాండ్ చేస్తున్న ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గనులు భూగర్భ శాఖ ఏడి కార్యాలయానికి చెంది భవనం యజమాని అధికారుల తీరుపట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. నందిగామలోని తన భవనంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న గనులు భూగర్భ శాఖ ఏడి కార్యాలయానికి గత 14 నెలలుగా అద్దె చెల్లించట్లేదని వెల్లడించారు. అద్దె కోసం అధికారులు చుట్టూ తిరిగినా... ప్రయోజనం లేకుండా పోయిందని భవనం యజమాని మరిపూడి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఏడి కార్యాలయాన్ని అక్కడి నుంచి ఖాళీ చేసి విజయవాడకు తీసుకెళ్లేందుకు అందులో ఉన్న ఫైల్స్ అన్నిటినీ వ్యాన్లో తరలించే ప్రయత్నాలు చేశారు.
తమకు ముందుగా అద్దె చెల్లించి తీసుకెళ్లాలని, అప్పుడు వరకు ఫైల్స్ తీసుకెళ్లవద్దని అధికారులను కోరాడు. దీనికి సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడంతో హనుమంతరావు కార్యాలయానికి తాళాలు వేశారు. ఇదే అంశంపై భవనం యజమాని హనుమంతరావు మాట్లాడుతూ... గత 14 నెలలుగా అధికారులు అదే చెల్లించలేదని వాపోయారు. ప్రభుత్వం నుంచి వచ్చాక ఇస్తామని అప్పుడు వరకు వేచి ఉండాలని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రతి రెండేళ్లకోసారి ఐదు శాతం పెంచాల్సినా... ఇప్పుటివరకు అద్దెను పెంచలేదని తెలిపారు. వెంటనే తనకు రావాల్సిన అద్దె ఇవ్వాలని డిమాండ్ చేశారు.
' గత జనవరి నుంచి అద్దె ఇవ్వడం లేదు. ప్రభుత్వ అధికారులు సంవత్సరం నుంచి అద్దె డబ్బులు ఇస్తామని అంటున్నారు. రెండు సంవత్సరాలకు ఓ సారి అద్దె పెంచాల్సి ఉన్నా... ఇప్పటివరకు పెంచలేదు. డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోవాలి అంటున్నారు. స్తానికాధికారులతో మాట్లాడితే పై అధికారులతో మాట్లాడాం అంటున్నారు. 14 నెలల అద్దె డబ్బులు ఇవ్వాలి. మేము ఊరికి వెళ్లి వచ్చేలోగా రూంలోని సామాను తరలిస్తున్నారు. నా డబ్బులు చెల్లించి సామాన్లు తీసుకోవాలని చెప్పాను.'- మరిపూడి హనుమంతరావు, భవనం యజమాని
ఇవీ చదవండి: