Tension in Vijayawada : విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విజయవాడ తరలివచ్చారు. పటమటలోని ఎస్ఎస్ఏ కార్యాలయం వద్దకు చేరుకుని శాంతియుతంగా ఆందోళన చేపట్టాలని భావించిన ఉద్యోగులకు పోలీసుల నుంచి తీవ్ర నిర్భంధం ఎదురైంది. వచ్చిన వారిని వచ్చినట్లే పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని పోలీసు స్టేషన్లకు తరలించారు. మరికొందరిని ఆటోనగర్‌లోని ఆటోమోబైల్ టెక్నిషియన్స్ అసోసియేషన్ హాలుకి తరలించారు.
Samagra Shiksha Abhiyan Employees Protest : గత నెల 20 నుంచి వివిధ రూపాల్లో తాము ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డైరెక్టరు నుంచి కనీస స్థాయి స్పందన లేదని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల అసోయేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు వెల్లబోసుకునేందుకు వచ్చిన తమను పోలీసులతో అణచివేతకు గురిచేస్తున్నారని ప్రైవేటు పాఠశాలల బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల్లో తమను బలవంతంగా వివిధ ప్రాంతాలకు తరలించడం అప్రజాస్వామికమని ఆరోపించారు. న్యాయమైన తమ డిమాండ్ల సాధన కోసమే తాము ఆందోళన చేస్తున్నామే తప్ప ఎలాంటి గొంతమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీలు మరిచావా జగనన్నా - ఏడో రోజు కొనసాగుతున్న ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె
బలవంతంగా విధుల నుంచి తొలగింపు : సమగ్ర శిక్ష పథకంలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు గత ఏడాది నవంబరు 20న సమ్మె నోటీసు ఇచ్చి డిసెంబరు 20 నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నారు. సమస్యలపై ఉద్యోగ సంఘ ప్రతినిధులతో ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే సమ్మె అనివార్యమైందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. సమ్మెలోని ఉద్యోగులను ప్రత్యేకించి KGBVలలోని మహిళా ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేయడం, తూలనాడడం, బలవంతంగా విధుల నుంచి తొలగించడం వంటి చర్యలకు పాల్పడడం చట్ట వ్యతిరేకమని ఇలాంటి చర్యలను ఎస్ఎస్ఏ ఐకాస తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
డిమాండ్స్ : ఇప్పటికైనా ఇలాంటి చర్యలను నిలుపుదల చేయాలని ఉద్యోగులను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ వారు చేశారు. రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగానే ఎస్‌పీడీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి- వారి సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సమగ్ర ఉద్యోగులందరికీ HR పాలసీ అమలు చేయాలని ఉద్యోగుల గ్రీవెన్స్‌ల పరిష్కారానికి రాష్ట్రస్థాయిలో నోడల్ అధికారి నియమించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, అందరికీ జాబ్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మా డిమాండ్లు పరిష్కరించేంతవరకూ ఆందోళనలు కొనసాగిస్తాం - ఎంప్లాయూస్ ఫెడరేషన్
ప్రస్తుతం ఉన్న పార్ట్‌టైం విధనాన్ని రద్దు చేసి ఫుల్‌టైం ఒకేషనల్ టీచరుగా మార్చి వేతనాలు పెంచాలని ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో మార్చి మినిమం ఆఫ్ టైం స్కేల్ అమలు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. పది లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాట్యుటీ కల్పించాలని, సామాజిక భధ్రత పథకాలు అమలు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలని కోరారు.
అరెస్టులు : సుమారు 24 డిమాండ్ల సాధన కోసం ఛలో విజయవాడ వచ్చిన తమను పోలీసులు బలవంతంగా, దౌర్జన్యంగా అరెస్టు చేయడం సరికాదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పటమట, పంటకాలువ రోడ్లలో భారీగా పోలీసులు మోహరించారు. చుట్టుపక్కల దుకాణాలను సైతం మూసివేయించి ఎక్కడిక్కకడ వచ్చిన వారిని వచ్చినట్టే బృందాలుగా అరెస్టులు చేసి తరలిస్తుండడంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.