TDP Leader Yanamala Letter to Finance Minister: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖలో.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజల ఆందోళనను వెల్లడించారు. అధికారంలోకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. మూడేళ్ళలో చేసిన అప్పు/స్థూల ఉత్పత్తి నిష్పత్తుల వివరాలపై యనమల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Yanamala on YCP: 'టీడీపీ మినీ మేనిఫెస్టో.. జగన్ దుష్టపాలన అంతానికి తొలిమెట్టు': యనమల
Yanamala Fire on YSRCP Govt: అనంతరం తెలుగుదేశం హయాంలో ఐదేళ్లలో 1.39 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఆందోళన చెందారని.. జగన్ వచ్చాక గత మూడేళ్లలో 3.25 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 97 ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే.. 30 సంస్థలే ఆడిట్ లెక్కలు చూపాయని కాగ్ చెప్పిందన్నారు. 67 సంస్థలు లెక్కలు చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్న యనమల.. ఈ సెప్టెంబర్ నాటికి ఉన్న రాష్ట్ర అప్పులు ఎంతో చెప్పాలని కోరారు. ఉద్యోగస్తులు, గుత్తేదారులు, విద్యుత్ సంస్థల బకాయిలు చెప్పాలని.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఖర్చు లెక్కలు అందించాలని లేఖలో యనమల పేర్కొన్నారు.
Yanamala Letter Details: ''గౌరవ ఆర్థిక శాఖమాత్యులు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతునారు. కాగ్ సంస్థ వారు 2021-22 ఆడిట్ నివేదికలో ఇచ్చిన గణాంకాలను చూసిన తరువాత గత ఆగస్టు 23, 2023న నేను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ గారికి ఒక లేఖ రాసి, కొంత సమాచారాన్ని కోరాను. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న నాకు ఆర్థిక శాఖ కార్యదర్శి నుండి ఏ విధమైన సమాధానం రాకపోవడం శోచనీయం.
కాగ్ 2021-22 నివేదిక ప్రకారం.. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత మూడేళ్ళలోనే రూ.3.25 లక్షల కోట్లు అప్పు చేశారు. అప్పు /స్థూల ఉత్పత్తి నిష్పత్తి 40 నుండి 45 శాతం వరకు ఉంది. 2021-22 ఆడిట్ తరువాత సంవత్సరన్నర కాలంలో సుమారు రూ.1.25 లక్షల కోట్లు అప్పు చేశారు. అంటే నాలుగున్నర సంవత్సరాలలో 4.5 లక్షల కోట్లు అప్పుతో ఈ ప్రభుత్వం నడుస్తోంది. అంతేకాకుండా, 97 పబ్లిక్ సెక్టార్ సంస్థలకు గాను కేవలం 30 సంస్థలు మాత్రమే ఆడిట్‌కు లెక్కలు సమర్పించాయని కాగ్ ఆక్షేపించింది. లక్ష కోట్ల రూపాయల అప్పును ప్రతి యేటా చేస్తూ వచ్చే సంవత్సరం నుండి (2024-25) సంవత్సరానికి రూ.50 వేల కోట్లకు మించిన చెల్లింపుల భారాన్ని ప్రజల మీద పెట్టారని కాగ్ చెబుతోంది.'' అని యనమల రామకృష్ణుడు లేఖలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు.