TDP Leader Nara Lokesh on BC Jayaho Program: తెలుగుదేశం పార్టీ 2024 జనవరి 4వ తేదీన 'జయహో బీసీ' పేరిట ఓ కార్యక్రమం నిర్వహించబోతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ఆ కార్యక్రమంలో బీసీలకు సంబంధించి ఓ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. బీసీ సోదరులకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని, రాష్ట్రంలోని బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా స్వాతంత్రం వచ్చిందంటే అది టీడీపీతోనేనని లోకేశ్ అన్నారు.
Nara Lokesh media conference: కొత్త ఏడాదిలో తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే 'జయహో బీసీ' కార్యక్రమం వివరాలను నారా లోకేశ్, పార్టీ నేతలతో కలిసి వెల్లడించారు. ఈ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ జయహో కార్యక్రమం కింద నిర్వహించబోయే కార్యక్రమాలు, నిర్ణయాలు, వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలపై చేసిన దాడుల వివరాలను నారా లోకేశ్ వెల్లడించారు.
బీసీలకు ప్రత్యేక చట్టం - అందరికీ అండగా ఉంటాం : నారా లోకేశ్
Nara Lokesh Comments: ''2024 జనవరి 4వ తేదీన జయహో బీసీ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమం పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. బీసీలకు ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించాం. బీసీలు బలహీనులు కాదు, బలవంతులన్నదే మా పార్టీ నినాదం. బీసీ సోదరులకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా స్వాతంత్రం వచ్చిందంటే అందుకు కారణం తెలుగుదేశం పార్టీనే. 1982లో ఎన్టీఆర్ గారు బీసీలకు సీట్లిచ్చి, గెలిపించి, కీలకమైన శాఖలను బీసీలకు అప్పగించారు. అలాంటి బీసీలపై ఈ జగన్ మోహన్ రెడ్డి దాడులు చేయించాడు. ఈ జగన్ బీసీల ద్రోహి. టీడీపీ కోసం పనిచేస్తున్న బీసీ నాయకులందరిపైనా అక్రమ కేసులు పెట్టారు. అందుకే జయహో బీసీ పేరిట జనవరి 4వ తేదీన పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమం చేపట్టబోతున్నాం.'' అని యువనేత నారా లోకేశ్ అన్నారు.
Nara Lokesh on Jayaho BC Public Meeting: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించే వర్క్ షాప్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని నారా లోకేశ్ అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో క్షేత్ర స్థాయికి వెళ్తామన్నారు. క్షేత్రస్థాయి చైతన్య కార్యక్రమాల తర్వాత జయహో బీసీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. బీసీలకు రక్షణ చట్టం పేరిట మినీ మేనిఫెస్టోలో ఇప్పటికే ప్రాధాన్యం కల్పించామన్న యువనేత లోకేశ్, బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామన్నారు. దీంతోపాటు బీసీ ఉప కులాల కోసం ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేసి, ఆ నిధులు వారికే ఖర్చు చేస్తామని తెలిపారు.
తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టే వరకు యుద్ధం ఆగదు: నారా లోకేశ్
Lokesh Fire on Cancellation of Adharana Scheme: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరులను ఇబ్బంది పెట్టిన సంఘటనలను వివరిస్తూ యువనేత లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10శాతం రిజర్వేషన్ తగ్గించారని లోకేశ్ మండిపడ్డారు. 16 వేల మంది బీసీలకు అవకాశాలు లేకుండా చేశారని దుయ్యబట్టారు. 8 వేల ఎకరాలు బీసీల అసైన్డ్ భూములను కూడా వెనక్కి తీసుకున్నారన్న లోకేశ్, ఆదరణ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందలేదని రైతులు తన పాదయాత్రలో చెప్పారని యువనేత పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పంది. కానీ, వాటికి నిధులు, విధుల్లేవు ఇవ్వలేదని లోకేశ్ ధ్వజమెత్తారు. జీవో 217 తీసుకొచ్చి, మత్స్యకారుల వెన్నెముక విరగ్గొట్టిందని, పట్టు రైతులకు కనీసం సబ్సిడీ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని లోకేశ్ ఆగ్రహించారు. బీసీ సోదరుల తరఫున పోరాడుతున్న యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రడు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు వంటి సీనియర్ నేతలపై జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే సీట్లను వైసీపీ బీసీలకు ఇస్తోంది. వైసీపీలో గుర్తింపు లేదని ఎమ్మెల్యే పార్థసారథి ఆవేదన చెందారు. కల్లు గీత, స్వర్ణకారులను జగన్ ప్రభుత్వం మోసం చేసింది. వైసీపీ అధిష్ఠానం అభ్యర్థులను మార్చుకుంటూ పోతోంది. ఒకచోట చెత్త అయితే, మరోచోట బంగారం అవుతుందా?. తప్పు చేసిన వాళ్ల గురించి మాట్లాడితే తప్పేంటి?. అధికారులు తప్పు చేసినా మాట్లాడకూడదా?. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు మాత్రమే రాశాం. రెడ్ బుక్‌లో రాసిన వారిపై న్యాయ విచారణ వేస్తామని చెప్పాం. సీఐడీనే స్క్రిప్ట్ రాసివ్వమనండి నేను చదువుతా?. రెడ్ బుక్‌లో ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్లకెలా తెలుసు?.-నారా లోకేశ్
Nara Lokesh on 'Vyuham' Movie: 'వ్యూహం' సినిమాపై నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. 'వ్యూహం' సినిమాకు ప్రతివ్యూహం ఉండకూడదంటే ఎలా? అని లోకేశ్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఈ తరహా సినిమాలు ఫ్యాషన్‌గా మారాయని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి సినిమాలకు జగనే డబ్బులు పంచుతున్నారని దుయ్యబట్టారు. ఆర్జీవీ తరఫున వైసీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారన్న లోకేశ్, న్యాయపరంగా తమకున్న హక్కుల కోసం పోరాడుతున్నామన్నారు. ఆర్జీవీ కావాలంటే 'హూ కిల్డ్ బాబాయ్, కోడి కత్తి తీయవచ్చు కదా?' అని లోకేశ్ సూచించారు.
Lokesh Meet with Handloom Workers: పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో చేనేతలతో యువనేత నారా లోకేశ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం చేనేతలతో ఆయన మాట్లాడుతూ ''రాష్ట్రంలో చేనేత రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ఉండే అన్ని అవకాశాలను పరిశీస్తాను. చేనేతలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మెరుగైన స్థితిలో నిలపడానికి ప్రయత్నిస్తాను. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తాం. హ్యాండ్ లూమ్, పవర్ లూంను వేర్వేరుగా అభివృద్ధి చేయడానికి ఉన్న మార్గాలను పరిశీలించి, ఆ దిశగా ప్రోత్సాహం అందిస్తాం. జగన్ రెడ్డి బటన్ నొక్కి పేదలను ఉద్దరిస్తున్నానని చెప్పుకుంటూ, మరో బటన్ నొక్కి పేదల జేబులు ఖాళీ చేస్తున్నాడు. పేదలను సొంత కాళ్లపై నిలబెట్టడం ద్వారానే శాశ్వత ప్రయోజనాలు సాకారమవుతాయని చంద్రబాబు నాయుడి గారి ఆలోచన. ఆ దిశగానే మేం ముందుకు సాగుతాం'' అని ఆయన అన్నారు.
'లోకేశ్‌ను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని తెలుసు - రాష్ట్ర భవిష్యత్ కోసం ఆయనకు రక్షణగా నిలబడ్డాం'