CHANDRABABU DELHI TOUR : రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిల్లీ చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం జీ20 సమాఖ్యపై నిర్వహిస్తున్న అఖిలపక్ష భేటీకి ఆయన హాజరు కానున్నారు. అంతకుముందు.. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ భేటీలో చర్చించనున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ, ప్రస్తుత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలు, అధికారాన్ని ఉపయోగించి చేస్తున్న అరాచకాలపై పార్లమెంటు సాక్షిగా లేవనెత్తాల్సి విషయాలపై చర్చించనున్నట్లు సమాచారం.
అదే విధంగా.. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నిధులు పక్కదారి పట్టించడం, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయకుండా విజ్ఞప్తి చేసే విషయంపై కూడా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజకీయ దాడులు, కక్షసాధింపు చర్యలు, అక్రమ కేసులు బనాయించడం, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం వంటి విషయాలపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజక్టు, అమరావతి నిర్మాణంపై కూడా అనేక రూపాల్లో కేంద్రం నుంచి సమాధానాలు రాబట్టే విషయంపై కూడా టీడీపీ ఎంపీలు చర్చించనున్నారు. వీటితోపాటు.. జాతీయ స్థాయిలో పలు అంశాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. పార్లమెంటరీ పార్టీ భేటీ తర్వాత... సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగే జీ20 అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు.
ఇవీ చదవండి: