Statewide Anganwadi Workers Strike : అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేశారు. కార్మిక సంఘాల ఐక్య వేదిక జైల్‌భరోకు పిలుపునివ్వటంతో నిరసనకారులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి తరలివచ్చారు. పలు ప్రాంతాల్లో రాస్తారోకో నిర్వహించారు. ప్రజా సంఘాలు చేపట్టిన ర్యాలీ అరెస్టులకు దారి తీసింది.
Vijayawada : విజయవాడలో ర్యాలీగా వెళ్తున్న కార్మికులు, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్మా చట్టాన్ని అంగన్వాడీలపై ప్రయోగించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని కార్మిక సంఘాల ఐక్య వేదిక నేతలు విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద మున్నేరులో అంగన్వాడీలు జల దీక్ష చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ముట్టడికి కార్మిక సంఘాలు, అంగన్వాడీలు యత్నించారు. పోలీసులు, కార్మిక సంఘాల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది. బారీకేడ్లు తోసుకుంటూ అంగన్వాడీలు ముందుకు కదిలారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులో కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కార్మిక సంఘాల నేతలను అరెస్టు చేశారు.
కొవ్వొత్తులతో అంగన్వాడీల నిరసనలు - డిమాండ్లు పరిష్కరించేవరకు వెనక్కు తగ్గబోమని స్పష్టం
Satyasai District : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో అంగన్వాడీలు నల్ల రిబ్బన్లు నోటికి కట్టుకుని నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం జగన్ చిత్రపటానికి పూజలు చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ భజనలు చేశారు. కడపలో అంగన్వాడీ కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ర్యాలీ చేశారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద ప్రధాన రహదారిని అంగన్వాడీలు, ప్రజాసంఘాల నేతలు దిగ్బంధించారు. పోలీసులు ఆందోళన కారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులో అంగన్వాడీలు మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నంద్యాల జిల్లా డోన్‌లో అంగన్వాడీలు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. స్టేషన్ గోడలు ఎక్కి మరీ లోపలికి ప్రవేశించారు. జీతాలు పెంచుతారా లేదా జైల్లో పెడతారా అంటూ నినాదాలు చేశారు.
సంక్రాంతిలోగా సమస్యలు పరిష్కరించకపోతే ప్రత్యక్ష కార్యాచరణ - రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు
Ongole : ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో అంగన్వాడీలు ప్రజాసంఘాలు రాస్తారోకో నిర్వహించారు. ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని రోడ్డుపై బైఠాయించారు. నిరసనకారులు, అంగన్వాడీలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం తమపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించటాన్ని కోనసీమ జిల్లా పి.గన్నవరంలో అంగన్వాడీలు తీవ్రంగా తప్పుబట్టారు. జీవో నంబర్-2 ప్రతులను గోదావరిలో నిమజ్జనం చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అంగన్వాడీ కార్యకర్తలు మోకాళ్లపై నిలబడి జగనన్న నీకో దండం అంటూ నినాదాలు చేశారు.
ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఎన్నికల్లో బుద్ధి చెబుతాం: అంగన్వాడీలు
Vijayanagaram : విజయనగరంలో మున్సిపల్ కార్మికులు భిక్షాటన చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చేందుకు సీఎం జగన్ దగ్గర డబ్బులు లేవని, తమను పండగ పూట పస్తులు ఉంచుతున్నారంటూ దుకాణాల వద్ద యాచించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ధర్నా చేశారు. నెల్లూరులో మున్సిపల్ కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. కడపలో పారిశుద్ధ్య కార్మికులు ఒంటికి ఆకులు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. నగరంలో ర్యాలీ చేసి శవయాత్ర చేశారు.
'ఎస్మా చట్టాలకు భయపడం' - సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గెదే లేదు: అంగన్వాడీలు