Monsoon in Southeast Bay of Bengal బంగాళాఖాతంలో నైరుతీ రుతుపవనాల పురోగమనానికి అనువుగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. 24 గంటల్లో అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులపై నైరుతీ రుతుపవనాలు విస్తరిస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలియచేసింది. మరోవైపు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా కర్ణాటక వరకూ ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఏపీతో పాటు యానాంలో పశ్చిమ-నైరుతీ గాలుల ప్రభావం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియచేసింది.
పిడుగులతో కూడిన వర్షాలు నమోదు అయ్యే అవకాశం: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మాత్రం యథాతథంగా గరిష్టంగానే నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో నమోదు అవుతున్న తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియచేసింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములు పిడుగులతో కూడిన జల్లులు పడతాయని హెచ్చరికలు జారీ చేశారు.
నెల్లూరు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు: ఏపీలో అత్యధికంగా నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 44.18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. పలనాడు లోని నరసరావుపేటలో 44 డిగ్రీల రికార్డు అయ్యింది. గుంటూరు జిల్లా పొన్నూరులో 43.9 డిగ్రీలు, ప్రకాశం జిల్లా 43.8, ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల 43.4, తూర్పుగోదావరి 43.3, కృష్ణా 43.2 డిగ్రీల మేర రికార్డు అయ్యింది. తిరుపతి 43.1, బాపట్ల 42.8, రాజమహేంద్రవరం 42.6, ఎన్టీఆర్ 42.2, మన్యం 42.05, అనకాపల్లి 41.9, పశ్చిమగోదావరి 41.7, అల్లూరి జిల్లా, నంద్యాల 41.71, శ్రీకాకుళం 41.6 డిగ్రీలు రికార్డు అయింది. చిత్తూరు 41.4, కర్నూలు 41, కోనసీమ 40.9, కాకినాడ 40.6, విజయనగరం 40, అన్నమయ్య 40.4, కడప 40.2 డిగ్రీలు మేర నమోదైంది.
బయటకు రావాలంటే హడలిపోతున్న జనం: రాష్ట్ర వ్యాప్తంగా ఎండలకు ప్రజలు ఇంటి నుంచి భయటకు రావలంటే భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎండలకు తోడు అప్రకటిత విద్యుత్ కోతలతో సామన్య ప్రజలు.. అటు ఇంట్లో ఉండలేక, బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎండవేడిని తట్టుకోవడానికి చెట్లనీడను ఆశ్రయిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే హడలి పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక్క వేళ అత్యవసర పని మీద బయటకు వచ్చినా... గొడుగులను ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాబోయే వారం, పది రోజులపాటు ఎండలు అధికంగా ఉంటాయనీ.. ప్రజలు అత్యవసర పరిస్థితులు అయితే తప్పా బయటకు రాకుడదని వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి: