Vijayawada Indrakiladri: శుభకృత్ నామసంవత్సరం చివర్లో విజయవాడ ఇంద్రకీలాద్రిపై లోక కల్యాణార్ధం, భక్తజన శ్రేయస్సు కోసం శతచండీ సహిత మహారుద్రయాగం రేపటి నుంచి ఐదు రోజులపాటు జరగనుంది. పంచాహ్నికదీక్ష పూర్వకంగా ఈ యాగం నిర్వహించనున్నట్లు ఆలయ పాలక మండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ, ఆలయ స్థానాచార్యులు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ తెలిపారు. కొండపై చినరాజగోపురం వద్ద లక్ష్మీగణపతి స్వామి మందిరం వద్ద రేపు ఉదయం 10 గంటలకు విఘ్నేశ్వరపూజతో యాగం ప్రారంభం అవుతుంది. ప్రతిరోజు రుద్రహవనం, చండీఘోమం, మూలమంత్రి హవనాలతోపాటు ఇతర వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఆరో తేదీ ఉదయం మహా పూర్ణాహుతితో యాగం పరిసమాప్తం అవుతుంది. ఏడో తేదీ పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షణ జరుగుతుందని పాలకమండలి ప్రకటించింది.
అమ్మవారి కొండపై శతచండీ శతచండీ సహిత మహారుద్రయాగం కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకు విఘ్నేశ్వర స్వామి వారి పూజతో ప్రారంభించడం జరుగుతుంది. సుమారు 38 మంది రుత్వికులచే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. మూడవ నెల ఆరో తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు వేద పండితుల ఆశీర్వచనాలు అలాగే పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగియనుంది.- రాంబాబు, దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్
భక్తుల సౌకర్యార్ధం 18 అంశాలపై చర్చ: భక్తుల సౌకర్యార్ధం పాలకమండలి ఇటీవల 18 అజెండా అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు అధ్యక్షతన జరగగా.. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోటేశ్వరరావు, ఈవో భ్రమరాంబ, అధికారులు పాల్గొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ప్రతీ సామాన్య భక్తులకు అమ్మవారి అశీస్సులు అందరికీ ఉండాలని.. సటారీ ఇవ్వడంలో ప్రత్యేక ఏర్పాట్లకు ఆమోదం తెలిపారు. ఇంద్రకీలాద్రికి వచ్చే ప్రతి సామాన్య భక్తునికి ప్రసాదం, కుంకుమ ఇవ్వాలని పాలకమండలి నిర్ణయించినంది.
భక్తులకు ఇబ్బంది లేకుండా కింద నుంచి పైకి వెళ్లడానికి.. మరలా కిందకు రావడానికి వారి సౌకర్యార్ధం దుర్గాఘాట్ నుంచి కొండపైకి రెండు బస్సులు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. భక్తులకు ఉచితంగా కొండకు ఎగువన లేగా దిగువన చెప్పులు భద్రపరచుకునే సౌకర్యాన్ని కలిగించాలని ఆమోదించారు. పంచహారతుల టిక్కెట్టు కొనుగోలు చేసిన భక్తులకు అంతరాలయ దర్శనం, లడ్డూ ప్రసాదం ఉచితంగా ఇవ్వాలని సూచించింది. లక్ష రూపాయలు, ఇంగా ఆపైన అమ్మవారికి కానుకగా ఇచ్చే భక్తులకు నెలకొకసారి ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించాలని పాలక మండలి నిర్ణయించింది.
చలువ పందిళ్లు: రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని ముందుగా ఇంద్రకీలాద్రి కొండ మీద, కొండ దిగువన, కనకరదుర్గా నగర్‌లోనూ చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని తీర్మానిస్తూ.. అందుకు సంబంధించిన ఖర్చులకు పాలక మండలి ఆమోదం తెలిపింది. 30 కోట్లతో అన్నదాన భవనం నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు పాలక మండలి ఆమోదించింది. దీంతో పాటుగా 2023- 24 ఆర్ధిక సంవత్సర బడ్జెట్, ఆదాయ వ్యయ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో.. పాటు స్థానికులుకు కూడా దుర్గాఘాట్ వద్ద స్నానం చేసేందుకు తగిన సౌకర్యాలు లేకపోవడంపై వస్తోన్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని.. ఆధునికీకరణ పనులు వెంటనే చేయాలని.. అధికారులను ఆదేశించినట్లు పాలకమండలి ఛైర్మన్ తెలిపారు.
ఇవీ చదవండి: