Bamboo Mats : వేసవి వచ్చిందనంటే భానుడిని తట్టుకోవడం చాలా కష్టం..! దానికి తోడు పర్యావరణ మార్పులు, మానవ తప్పిదాలు వెరసి.. సగటు కంటే మరింతగా నేడు సూర్యుడు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఎండల నుంచి ఉపశమనం కోసం కూలర్లు, ఏసీలు, ఫ్యాన్ల కొనుగోళ్లతో పాటు.. వెదురుతో చేసే రోలింగ్ మ్యాట్‌లకు కూడా గిరాకీ పెరిగింది. విజయవాడలో వీటిని కొనే వారు సంఖ్య పెరగడంతో.. తయారీదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎండలు మండిపోతున్న తరుణంలో విజయవాడ నగరంలోని ప్రజలు భానుడి వేడి నుంచి ఉపశమనం కోరుకుంటున్నారు. ఉదయం 8 గంటల నుంచే వేడి గాలులు విస్తుంటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు వెళ్తే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడని ఇంట్లోనే ఉంటే.. అప్రకటిత విద్యుత్ కోతలు మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి. కరెంట్‌పై నమ్మకం పెట్టుకోకుండా ఎండల నుంచి రక్షణ పొందేందుకు ప్రత్యామ్నయ మార్గాలను ప్రజలు వెతుక్కుంటున్నారు. ఏసీలు, కూలర్ల కొనుగోలు మాత్రమే కాకుండా.. రోలింగ్ మ్యాట్‌ల కొనుగోళ్లు బాగా పెరిగాయి. దానిమూలంగా వాటిని తయారు చేసే వారికి మూడు నెలల పాటు ఉపాధి లభిస్తోంది. రోలింగ్ మ్యాట్‌లను వ్యాపార సముదాయాలు, ఇంటి లోపల, బయట అమర్చుకునే సౌకర్యం ఉండడంతో.. ఎక్కువగా వీటిని కోనుగోలు చేస్తున్నారు.
నగరంలో వివిధ ప్రాంతాల్లో రోలింగ్ మ్యాట్‌లను తయారీ చేస్తున్నారు. కృష్ణలంక, వన్ టౌన్, పాయకాపురం ప్రాంతాల్లో ఉన్న డింబర్ డిపోల నుంచి వెదురు కర్రలను కొనుగోలు చేసి వాటి ద్వారా మ్యాట్ లను తయారు చేస్తుంటారు. వెదురును అడుగుల లెక్కన కొనుగోలు చేస్తామని.. ఒక్కొ కర్ర 180 నుంచి 200 రుపాయాల ధర పలుకుతుందని తయారీదారులు చెబుతున్నారు. వినియోగదారులు అభిరుచికి అనుగుణంగా మ్యాట్‌లను తయారు చేస్తామని.. 12 అడుగుల వెడల్పుతో ఎంత ఎత్తు కావాలంటే అంతా ఎత్తు వరకు మ్యాట్‌లను తయారు చేస్తామని తెలిపారు. వెదురు కర్రలతో తయారు చేసే ఈ రోలింగ్ మ్యాట్ ద్వారా ఎండ నుంచి రక్షణ పొందొచ్చని తయారీదారులు చెబుతున్నారు.
ఒక్క వెదురు కర్రకు 200 రూపాయల వరకు ఖర్చు అవుతోంది. 12 అడుగుల వెడల్పుతో కస్టమర్ ఎన్ని అడుగుల ఎత్తు మ్యాట్ కావాలంటే అన్ని అడుగుల మ్యాట్ తయారు చేసి అందిస్తాము. ఎండ వల్ల వచ్చే వేడి నుంచి, శీతాకాలంలో చలి నుంచి రక్షణ కోసం ఈ మ్యాట్‌లను వినియోగిస్తుంటారు." -అప్పారావు, తయారీదారుడు
ఈ మ్యాట్‌ల తయారీ వల్ల ఎండాకాలంలో పని బాగానే దొరుకుతోంది. ఎసీలు, కూలర్ల వలే కాకుండా ఇవి విద్యుత్ అవసరం లేకుండా ఎండ నుంచి రక్షణ ఇస్తాయి. ఈ రోలింగ్ మ్యాట్ తయారీకి పెట్టుబడి అవసరం అవుతోంది. కాబట్టి వినియోగదారులు ముందుగా వచ్చి అర్డర్ ఇచ్చిన తర్వాతే వారికి కావాల్సిన విధంగా తయారు చేస్తాము." -జోతమ్మ, తయారీదారు
ఇవీ చదవండి :