Sankranti festivities in AP: తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతిని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం శ్రీనివాసాచార్యులపేట దేవాంగుల వీధిలో సంక్రాంతి సంబరాలు సందడిగా సాగాయి. ముగ్గుల పోటీల్లో విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. కోనసీమ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు పండుగ శోభతో కళకళలాడాయి. సహపంక్తి భోజనాలు, ముచ్చట్లతో జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ చినాపెద్దా ఉల్లాసంగా గడిపారు.
గుంటూరు జిల్లా: గాలిపటాల పండుగ సందడిగా సాగింది. గోరంట్లలోని హోసన్నా మందిరం సమీపంలోని మైదానంలో పిల్లలు, యువకులు పతంగులు ఎగురవేసేందుకు పోటీ పడ్డారు. కాకుమానులో చెన్నకేశవస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, పురుషులకు ట్రాక్టర్ రివర్స్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు జిల్లా మాజీ న్యాయమూర్తి చుక్కా రిచల్ దేవవరం పోటీల్లో గెలిచినవారికి బహుమతులు ప్రదానం చేశారు. బాపట్ల జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెంలో ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. మొత్తం 25 జట్లు ఇందులో పాల్గొన్నాయి. ఏటా సంక్రాంతి వేళ పోటీలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
పల్నాడు జిల్లా: నాదెండ్ల మండలం ఎండుగుంపాలెంలో పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఊరంతా కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. మాజీ సర్పంచ్, శివశక్తి గ్రూప్ సంస్థల ఎండీ నందిగం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వంటల పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. నరసరావుపేటలోని కోడెల మైదానంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇందులో పాల్గొన్నారు. ప్రముఖ గాయని సునీత పాటలకు కలెక్టర్, ఎమ్మెల్యే నృత్యాలు చేసి అందరినీ అలరించారు.
వైఎస్సార్ కడప జిల్లా: వేంపల్లెలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పతంగులు ఎగురవేసి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాలలో వెంకటేశ్వరస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి స్వామివారి రథాన్ని లాగారు. మహిళల కోలాటాలు, చెక్కభజనలు, కీలు గుర్రాల నృత్యాలు అలరించాయి. కర్నూలులో వైశ్య ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సంక్రాంతిని సందడిగా జరుపుకున్నారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పారు. పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
విజయవాడ: సంక్రాంతిని పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గమ్మ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్దఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీశైలం మహా క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీపార్వతీ సమేత మల్లికార్జున స్వామికి రావణ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు.
పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు ఇరగవరం అత్తిలి మండలాల్లోని వివిధ గ్రామాల్లో కోడిపందాలు గుండాటలు యదేచ్చగా సాగాయి. రెండో రోజు ఉదయాన్నే ప్రారంభమైన పందాలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి.
తూర్పుగోదావరి: జిల్లాలో నిడదవోలు ఉండ్రాజవరం పెరవలి మండలాలలోని గ్రామాల్లోని కోడి పందాలు లైట్ల వెలుగులలో నిర్వహించారు. పగలు రాత్రి తేడా లేనివిధంగా కుక్కుటాలు తమ పౌరుషాలను బరుల వేదికపై పోరాడి నిరూపించుకున్నాయి. జిల్లాలో రాత్రి పొద్దు పోయేవరకు తమ అదృష్టాలను పరీక్షించుకున్నారు. పందాలలో, కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఉభయగోదావరి జిల్లాలలో రెండు రోజుల్లో సుమారు 100 కోట్ల రూపాయలు పైగానే చేతులు మారినట్టు పందెం రాయుళ్లు చెప్తున్నారు.
బాపట్ల జిల్లా: తీర ప్రాంతాల్లో విచ్చలవిడిగా కత్తులు కట్టి కోడిపందాలు నిర్వహిస్తున్నారు. రేపల్లె ,వేమూరు నియోజకవర్గల్లో భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహిస్తున్నారు. పల్లెకోన, ఈపురు, వేమూరు, వేటపాలెం, పెనుమూడి గ్రామ శివారులో రెండు రోజులుగా పందాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజా ప్రతినిధుల అండదండలతో నిర్వాహకులు పందేలు, కోత ముక్క, గుండాట, పేకాట జూదాలు నిర్వహిస్తున్నారు. అధికారులు పట్టిపట్టనట్లు వ్యవరిస్తుండటం పై పలు విమర్శలు వస్తున్నాయి.
నెల్లూరు జిల్లా: ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో జోరుగా కోడిపందాలు సాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నిర్వహకులు మూడు రోజులు ముందుగా ఏర్పాట్లు చేశారు. లక్షల రూపాయల వసూలు చేసి కోడి పందాలు ఆడుతున్నారు. పక్క మండలాల నుంచి కోడి పందెం ఆడేందుకు జనం వేలాదిగా తరలి వచ్చారు. వారి నుంచి సెల్ ఫోన్లను నిర్వహకులు బలవంతంగా లాక్కుంటున్నారు. వీడియో చిత్రీకరణ చేయకుండా టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అధికార పార్టీ నాయకులు కావడంతో పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఉమ్మడి కృష్ణాజిల్లా: జిల్లాలో చాలా ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లఘించి బరులు నిర్వహిస్తున్నారు. పందేలను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం వచ్చి వెళుతున్నారు. కోట్ల రూపాయల బెట్టింగ్ దందా కొనసాగుతుంది. మద్యం, గుండాట ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. కోడిపందాలు నిర్వహణ యదేశ్ఛగా కొనసాగుతుంది. బరులు విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు . అధికార నేతల అండదండలతో కోడిపందాలు కొనసాగుతున్నాయి. బరుల్లో కోళ్లు ఒకదానిపై ఒకటి కత్తి దూస్తున్నాయి. కోట్ల రూపాయల బెట్టింగ్ దందా కొనసాగుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడిపందాలు నిర్వహణకు బరులను చాలా ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అంపాపురం, కంకిపాడు పరిధిలోని ఈడుపుగల్లులో భారీ ఎత్తున బరులు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: