Cancellations of Pensions In AP : తొలగించిన పింఛన్లను పునరుద్దించాలని డిమాండ్ చేస్తూ తిరుపతి నగరపాలక సంస్థ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. లబ్ధిదారులను ఇబ్బందిపెట్టేలా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు. తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
"కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలను రద్దు చేయాటానికే ముఖ్యమంత్రి ఈ పన్నాగం పన్నాడు. మాట తప్పను మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి.. ఎందుకు ఈ మాట తప్పుతున్నాడు. ఏ ఒక్క పింఛన్ రద్దు కాకుడదని డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వ సలహాదారులుగా నియామితులైన 70 మందిని రద్దు చేయండి. వారికి ఇచ్చే జీతాలు, వారి వాహనాల ఖర్చులు వీటికి సరిపోతాయి." -రామానాయుడు, సీపీఐ నాయకుడు
వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లు తొలగించేందుకు అధికారులు నోటీసులు ఇవ్వడంపై కడప కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రిలే దీక్షలు చేపట్టింది. కడప నగరపాలక సంస్థ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల పింఛన్లు తొలగిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
"నాకు 2002లో రాజశేఖర్ రెడ్డి హయంలో 2సెంట్ల భూమి ప్రభుత్వం తరపున ఇచ్చారు. అంతే తప్ప నా పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు. నా పింఛన్ తొలిగించినట్లు నాకు నోటిసులు ఇచ్చారు. ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పటం లేదు." - ప్రసాద్, దివ్యాంగుడు, కడప
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పరిధిలోని ఇస్లాపురం గ్రామంలో పింఛన్ తొలగింపు నోటీసులు అందుకున్న బాధితులను టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి సవిత పరామర్శించారు. ప్రభుత్వానికి వృద్ధుల ఉసురు తగులుతుందని.. పింఛన్ పునరుద్ధరించే వరకు బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.
"మేము బట్టలు ఇస్త్రీ చేసుకుని జీవనం సాగిస్తాము. నాకు ఒక్కడే కుమారుడు. అతడు సంపాదన అతని కుటుంబానికే సరిపోవటం లేదు. నాకు ఆరోగ్యం బాగుండటం లేదు. నాకు పింఛన్ వస్తే ఆసుపత్రికి ఖర్చులకు ఉండేవి." - పింఛన్ బాధితురాలు, ఇస్లాపురం
నెల్లూరు జిల్లాలో 12వేల పింఛన్లు తొలగించారని.. వాటిని వెంటనే పునరుద్ధరించాలని టీడీపీ నేతలు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. పేదలు, వృద్ధులు, దివ్యాంగుల ఆవేదనను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
"దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారిని అర్హులు కారని తొలగించారు. రేపు మిగతా సంక్షేమ పథకాలకు కూడా అర్హులు కారని తొలగించే ప్రమాదం ఉంది. ప్రభుత్వం దివాలా తీసింది. దానికోసం ఇలా కసరత్తులు చేస్తోంది." -సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేత
రాజకీయ కక్షతో అర్హులకు పింఛన్లు తొలగిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు. విజయనగరంలో పర్యటించిన ఆయన.. సామాజిక పింఛన్లకు వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదన్నారు.
"మొదటి విడతలో ఇచ్చిన పింఛన్లకు ఇప్పుడు ఇచ్చే పింఛన్లను రకరకాల కారణాలతో తొలగించారు. సుమారు లక్ష 60వేల పింఛన్లను తొలగించారు. విచిత్రమేమిటంటే ఏదైనా రాజకీయ పార్టీలో పనిచేస్తున్న అర్హులను కూడా తొలగిస్తున్నారు." -గిడుగు రుద్రరాజు, పీసీసీ అధ్యక్షుడు
తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బాధితులతో కలసి వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు రిలే దీక్షలు చేపట్టారు.
ఇవీ చదవండి: