Ministers Committee Meeting with Employees Unions on GPS: సీపీఎస్ విధానం నుంచి బయటకు రావటం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు తేల్చి చెప్పింది. అదనపు ప్రయోజనాలు కల్పిస్తూ దాన్నే జీపీఎస్‌గా వ్యవహరిస్తున్నట్టు ఉద్యోగ సంఘాల నేతలకు వివరించింది. అదీ ఉద్యోగి వాటా సొమ్మంతా ఇస్తేనే.. 50 శాతం గ్యారంటీ పింఛన్ ఇస్తామని తేల్చి చెప్పింది. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని సీపీఎస్ ఉద్యోగులు స్పష్టం చేశారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన ఈ సమావేశాన్ని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించాయి.
Discussions of the Committee of Ministers on GPS: ఏపీలో అమలు చేయనున్న జీపీఎస్ విధానం దేశానికే ఆదర్శమని ప్రకటించుకున్న ప్రభుత్వం.. సీపీఎస్ నుంచి బయటకు రావటం లేదని ఉద్యోగ సంఘాలకు తేల్చి చెప్పింది. జీపీఎస్ అంశంపై సచివాలయంలో నిర్వహించిన మంత్రుల కమిటీ సమావేశానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘాలను ఆహ్వానించిన ప్రభుత్వం కొన్ని అదనపు ప్రయోజనాలు కల్పిస్తూ దాన్నే జీపీఎస్ విధానంగా వ్యవహరిస్తున్నట్టు ప్రజంటేషన్‌లో స్పష్టం చేసింది.
గ్యారంటీ పింఛన్ పథకాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా బలవంతంగా రుద్దేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారని, ఇప్పటికైనా పాత పింఛను పథకం -ఓపీఎస్‌ను అమలు చేయాలన్న ఉద్యోగుల డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్.. ఉద్యోగులను నిలువునా ముంచేలా ఉంది. ఉద్యోగులు తమ జీవిత కాలంలో ప్రతి నెలా పొదుపు చేసిన 10 శాతంతో పాటు ప్రభుత్వం జమ చేసే వాటా మొత్తాన్ని తీసేసుకొని 50 శాతం గ్యారంటీ పింఛను ఇస్తానంటోంది. లేదంటే 25 శాతం మాత్రమే ఇస్తామంటూ మెలిక పెట్టింది.
ఈ లెక్కన సీపీఎస్ ఉద్యోగి పదవీ విరమణ పొందాక వచ్చే ప్రయోజనాలు పెద్దగా ఏమీ ఉండవు. కేవలం ప్రభుత్వం ఇచ్చే పింఛను పైనే ఆధారపడాల్సి వస్తుంది. మరో వైపు సీపీఎస్ ఉద్యోగులకు కేంద్రం పెంచే మొత్తాన్ని పెంచే విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. తమ వద్ద నుంచే వసూలు చేసి తమకే 50 శాతం పెన్షన్ ఇస్తామని చెప్పటం ఏమిటని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు ప్రశ్నించాయి. ఉద్యోగ విరమణ సమయంలో తమ వాటా కింద వచ్చే 60 శాతం సొమ్ము తీసుకుని 50 శాతం పెన్షన్ ఇవ్వటం ఏమిటని సమావేశంలో మంత్రుల కమిటీని ప్రశ్నించారు.
ఓపీఎస్ విధానంలో ఉద్యోగి నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండనే వేతనంలో 50 శాతం మేర పెన్షన్ ఇస్తున్నారని ఆ లెక్కన జీపీఎస్‌లో పెన్షన్ గ్యారెంటీ 20 శాతాన్ని మించదని ఆక్షేపించాయి. అయితే ఉద్యోగ సంఘాలు సమర్పించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రితో చర్చించి తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. దీనిపై అధ్యయనం చేసి మరోమారు సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి బొత్స వెల్లడించారు.
ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ విధానంలో ఏం అంశాలు చేర్చాలో మంత్రుల కమిటీ అభిప్రాయాన్ని కోరిందని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు కేంద్రం పెంచిన 14 శాతం ప్రభుత్వ వాటాను ఏపీలో చెల్లించకపోవటం దారుణమని కమిటీకి వివరించాయి. పాత పెన్షన్ విధానంలో అమలయ్యే అన్ని అంశాలనూ జీపీఎస్‌కు వర్తింప చేయాలని ఏపీఎన్జీఓ, అమరావతి జేఏసీ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరాయి. అయితే జీపీఎస్ విధానం అమలులో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేసింది.
సీపీఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌లో 60 శాతం తీసుకుంటామని ప్రభుత్వం బాంబు పేల్చిందని.. ఈ విషయాన్ని ఇప్పటి వరకు స్పష్టం చేయలేదని ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ వ్యాఖ్యానించింది.
CPS Unions Fire on YCP Government : జీపీఎస్ విధానంపై ఎలాంటి ముసాయిదా ఇవ్వకుండా ప్రభుత్వం మార్గదర్శకాలపై చర్చించాలంటే ఎలా అని ఇతర ఏపీ సీపీఎస్ ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. మంత్రుల కమిటీ నిర్వహించిన సమావేశాన్ని బహిష్కరించిన సీపీఎస్ ఉద్యోగ సంఘాలు ఈ సమావేశానికి హాజరైన ప్రధాన ఉద్యోగ సంఘాలపైనా తీవ్ర ఆరోపణలు గుప్పించాయి.
ప్రభుత్వం నిర్వహించిన సమావేశాన్ని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని నాలుగు ప్రధాన ఉద్యోగ సంఘాలు నేతలు మినహా మిగతా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించాయి. మరోవైపు జీపీఎస్ విధానం అమలుపై ఉద్యోగ సంఘాలతో చర్చలు నిర్వహించిన ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగ సంఘాలనెవరినీ సమావేశానికి ఆహ్వానించకపోవటం విశేషం.
వైనాట్ ఓపీఎస్ కార్యక్రమం : సీపీఎస్ ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధం అవుతాయని ప్రకటించాయి. సెప్టెంబరు 1 తేదీన వైనాట్ ఓపీఎస్ (Why not OPS) అనే కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామని నేతలు తేల్చి చెప్పారు.
Prathidwani: సీఎం జగన్ చెబుతున్నట్లు సీపీఎస్ రద్దు చేయటం అసాధ్యమా?