World Environment Day celebrations in Vijayawada: రాష్ట్ర వ్యాప్తంగా అటవీ విస్తీర్ణాన్ని 23 శాతం నుంచి 33 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ, పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విజయవాడలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ కాలుష్యం - పరిష్కారంపై ఏర్పాటు చేసిన సదస్సును మంత్రి పెద్దిరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించారు. అనంతరం మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి... కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.
కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పుస్కరించుకుని ఏటీబీ మిషన్‌ను ఆవిష్కరించారు. ఏటీబీ మిషనులో రూ. 10 నాణెం వేస్తే బ్యాగ్ వచ్చేలా ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించామని మంత్రి తెలిపాడు. తిరుమల తిరుపతి దేవస్థానం సహా అన్ని దేవాలయాల్లో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం తగ్గించామన్నారు. సముద్ర, నదీ తీరాల్లో, చెరువులు, కాల్వల్లో శుభ్రత కార్యక్రమం చేపట్టామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు.
160 అర్బన్ ప్రాంతాల్లో నగర వనాలు: రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న రూ.13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాల్లో కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి సంబంధించే అధికంగా వచ్చాయని మంత్రి వెల్లడించారు. 160 అర్బన్ ప్రాంతాల్లో నగర వనాలు ఏర్పాటు చేశామన్నారు. నగర ప్రజలు ప్రకృతిని ఆస్వాదించడానికి ఈ నగర వనాలు ఎంతగానో తొడ్పడుతాయని మంత్రి తెలిపాడు. అడవుల విస్తీర్ణానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. 23 శాతంగా ఉన్న అడవుల విస్తరణను 33 శాతంగా పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వివిధ కంపెనీలకు మెమెంటోలను బహుకరించారు.
'రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించింది. రాష్ట్రంలో కాలుష్య నివారణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. తిరుమల తిరుపతి దేవస్థానం సహా అన్ని దేవాలయాల్లో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం తగ్గించాం. సముద్ర, నదీ తీరాల్లో, చెరువులు, కాల్వల్లో శుభ్రత కార్యక్రమం చేపడుతున్నాం. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న రూ.13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాల్లో కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి సంబంధించే అధికంగా వచ్చాయి.'- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి