Minister Botsa Satyanarayana Fires on BJP: వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు పెరిగాయని బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖ సభలో చేసిన వ్యాఖ్యలపై విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను అమిత్‌షా మాట్లాడారని విమర్శించారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌పై సైతం మండిపడ్డారు. అమిత్ షా చెప్పే వరకూ జీవీఎల్ నరసింహరావుకు రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని తెలీదా అని ప్రశ్నించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఇంతకాలం ఎందుకు ప్రశ్నించలేదో.. జీవీఎల్ ఆత్మ విమర్శ చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను అమిత్‌షా, జీవీఎల్ మాట్లాడారనే విషయం అర్ధమవుతోందని అన్నారు. గురివింద గింజల్లా.. తమ కింద మచ్చను బీజేపీ నేతలు చూసుకోవాలని హితవు పలికారు. దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఏంటో.. ఆ పార్టీ నేతలు పరిశీలించుకోవాలని సూచించారు.
"అమిత్‌షా చెప్పేవరకూ జీవీఎల్‌కు రాష్ట్రంలో అవినీతిపై తెలియదా. ఇంతకాలం ఎందుకు ప్రశ్నించలేదో జీవీఎల్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను అమిత్‌షా, జీవీఎల్ మాట్లాడారని అర్థమవుతోంది. గురివింద గింజల్లా తమ కింద మచ్చను బీజేపీ నేతలు చూసుకోవాలి. ప్రధానితో మా బంధం ఎలా ఉందో, అమిత్‌షాతోనూ అలానే ఉంది. ఒకరితో ఎక్కువ, మరొకరితో తక్కువ లేవు. అందరితో పాటు 2 వందేభారత్ రైళ్లు ఇవ్వటం తప్ప రాష్ట్రానికి బీజేపీ ఏమిచ్చింది. బీజేపీ నుంచి మాకు ఎలాంటి వెన్నుదన్ను ప్రత్యేకంగా లేదు."-బొత్స సత్యనారాయణ, మంత్రి
ప్రధానితో తమ బంధం ఎలా ఉందో అమిత్‌షా తోనూ తమకు అలానే ఉందన్న బొత్స.. ఒకరితో ఎక్కువ, మరొకరితో తక్కువ లేదని స్పష్టం చేశారు. కొట్టు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తెలిపారు. ఏపీకి అందరితో పాటు 2వందే భారత్ రైళ్లు ఇవ్వటం తప్ప బీజేపీ ఏమిచ్చిందని ప్రశ్నించారు. 9ఏళ్ల తర్వాత రెవెన్యూ లోటు నిధులు ఇచ్చి ఏదో ఉద్ధరించామంటే ఎలా అన్న మంత్రి.. వడ్డీతో సహా చూస్తే ఇంకా ఎక్కువే రావాలన్నారు.
గతంలో బీజేపీ నుంచి తమకున్న బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఏంటి, ఇప్పుడు లేనిది ఏంటని నిలదీశారు. కమలం పార్టీ నుంచి తమకు ఎలాంటి వెన్నుదన్ను ప్రత్యేకంగా లేదని తెలిపారు. 2019 ముందు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి, తమ ఎంపీలు పార్లమెంట్లో పోరాడుతున్నారు కాబట్టి రాజీనామా అనవసరమని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
కాశీ యాత్రలా వారాహి: ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేటి నుంచి చేపట్టే వారాహి యాత్రపై మంత్రి బొత్స పలు వ్యాఖ్యలు చేశారు. పవన్ యాత్రను.. కాశీ యాత్రతో పోల్చారు. పవన్ కల్యాణ్ చేసే రాజకీయ యాత్రకు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని అన్నారు. ప్రజలకు ఇస్తున్న సంక్షేమం ఆపేయటమేనా పవన్ దృష్టిలో వైసీపీ విముక్త ఏపీ అంటూ బొత్స నిలదీశారు.