Mahabubabad Road Accident Today : మూడేళ్ల క్రితం భార్య చనిపోయింది. తల్లిలేక తల్లడిల్లుతున్న ముక్కుపచ్చలారని చిన్నారులు. ఇంటికేదో శనిపట్టిందని భావించాడు ఆ ఇంటి యజమాని. మొక్కు తీర్చుకుంటే బాగవుతుందని దేవుడి వద్దకు వెళ్లిన ఓ కుటుంబానికి అదే చివరి రోజైంది. రోడ్డు ప్రమాదం రూపంలో దారికాచిన మృత్యువు ఇద్దరు చిన్నారులు సహా, ఇంటి పెద్దను నానమ్మను బలితీసుకుంది. మహబూబాబాద్ జిల్లాలో రాత్రి చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదం పండుగపూట స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్నఎల్లాపురం గ్రామానికి చెందిన శ్రీను-శిరీషకు రిత్విక్, రిత్విక అనే ఇద్దరు పిల్లలుండగా కరోనా సమయంలో శిరీష చనిపోయింది. భార్య మృతి, చిన్నారుల దయనీయ పరిస్థితితో మానసికంగా కుంగిపోయిన శ్రీను, ఇంట్లో పరిస్థితులు బాగాలేవని పూజలు, పుణ్యక్షేత్రాలకు తిరుగుతున్నాడు.
ఈ క్రమంలోనే శ్రీను తల్లి, తన ఇద్దరు పిల్లలతో పాటు అత్తగారి కుటుంబంతో కలసి ఆదివారం ఆటోలో నాగార్జునసాగర్ సమీపంలోని గుండ్లసింగారంలో గల బుడియాబాపు ఆలయానికి వెళ్లాడు. పూజలు ముగించుకుని సాయంత్రం బయలుదేరిన క్రమంలోనే కంబాలపల్లి, జిమ్మాండ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న అర్బన్‌పార్కు వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన కారు, శ్రీను కుటుంబం వెళ్తున్న ఆటో ఢీకొన్నాయి.
రాష్ట్రంలో నెత్తురోడిన రహదారులు - వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
Family Killed in Road Accident at Kambalapally : కారు వేగంగా ఢీకొనటంతో ఆటో నుజ్జునుజ్జు అయింది. దీంతో వీరంతా ఆటోలోనే ఇరుక్కుపోయారు. స్థానికుల సమాచారం ఇవ్వటంతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే శ్రీను, ఆయన తల్లి , కుమార్తె రిత్విక ప్రాణాలు కోల్పోయారు. కొన ఊపిరితో ఉన్న రిత్విక్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురికీ తరలించారు. ఆటోలో ఉన్న శ్రీను బావమరిది సర్దార్, అత్త శాంతి తీవ్రంగా గాయపడగా, వారిని మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దేవుడికి మొక్కు తీర్చుకునేందుకు వెళ్లిన వారంతా విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి స్థానికులను కంటతడి పెట్టించింది.
Kambalapally Road Accident Today : కారులో ఉన్న వారిలో తిరుపతి అనే వైద్యుడితో పాటు ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన కురవికి చెందిన యువకుడు, వారి స్నేహితులు ఉన్నట్లు తెలుస్తోంది. కారులో ఉన్న వారు మద్యం మత్తులో ఉన్నారని, అతివేగంగా వాహనం నడిపి, ఆటోను ఢీకొట్టడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు - ఇద్దరు మృతి 'బస్సుకింద పడి మరొకరు'
అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన బైక్- ఇద్దరు మృతి