Ayyanna Patrudu: రాష్ట్రంలో న్యాయం ఇంకా బ్రతికే ఉందని మరోసారి నిరూపితమైందన్నారు మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు. ఫోర్జరీ కేసులో సీఐడీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేయగా విశాఖ మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ రిమాండ్ తిరస్కరించడంతో అయ్యన్నపాత్రుడు విడుదలయ్యారు. విశాఖ నుంచి నర్సీపట్నం చేరుకున్నారు. మార్గమధ్యలో అడుగడుగునా ఆయనకు అభిమానులు హారతులతో స్వాగతం పలికారు. ప్రభుత్వ తప్పులు ఎత్తిచూపితే రాజకీయంగా చూడాలే తప్ప, కక్షసాధింపు చర్యలకు దిగడం సమంజసం కాదన్నారు. తనపై కోపంతో.. కుటుంబ సభ్యుల్ని వేధించడం తగదన్నారు. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి బలవంతంగా సీఐడీ పోలీసులు తనను అరెస్ట్ చేసినా.. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని చెప్పారు.
అయ్యన్నకు బెయిల్ మంజూరు చేయడంతో నర్సీపట్నంలో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చారు. కష్ట సమయంలో.. అండగా నిలిచినవారికి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అయ్యన్నపాత్రుడికి ఫోన్ చేసిన చంద్రబాబు.. వైకాపా సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలపై అయ్యన్న పోరాటాన్ని ప్రశంసించారు. మున్ముందు ఇదే పంథా కొనసాగించాలని.. పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇవీ చదవండి: