KRISHNA WATER DISPUTE రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పీసీసీ మాజీ అధ్యక్షులు శైలజానాథ్‌లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర క్యాబినెట్ నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఉత్తరం రాసి, ఊరుకున్నారని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అన్ని సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
CPI Ramakrishna Comments: విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీఐ రామకృష్ణ సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ''జగన్ అతని స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారు. కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంలో పునః పంపిణీ అంటే కచ్చితంగా రాష్ట్రానికి అన్యాయం జరిగినట్టే. కేంద్ర క్యాబినెట్ నిర్ణయంపై సీఎం జగన్ ఉత్తరం రాసి ఊరుకున్నారే తప్ప.. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. విశాఖ ఉక్కు ఉత్పత్తి తగ్గిస్తున్నా, దాని మనుగడ కోల్పోయేలా చేస్తున్నా.. చూస్తూ ఉండిపోయారు. రాష్ట్రంలో అన్ని రంగాలను నాశనం చేస్తున్నారు. తక్షణమే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అన్ని సంఘాలు పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.'' అని ఆయన అన్నారు.
MLA Gottipati Ravikumar Fire on CM Jagan: కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి.. పునః సమీక్ష ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆపించాలని.. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ డిమాండ్ చేశారు. అలా జరగనిపక్షంలో రాష్ట్రంలోని అన్నదాతలకు ఆర్తనాదాలేనని మిగులుతాయని అన్నారు. రాష్ట్రాన్ని భ్రష్ఠు పట్టించేంతవరకూ సీఎం జగన్.. నిద్రపోయేలా లేరంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్రంతోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాపై పగ బట్టినట్టు జగన్ వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. నాడు మౌనంగా ఉండి.. ఇప్పుడు లేఖలు రాస్తే ఏం ప్రయోజనమని నిలదీశారు. ఇప్పటికే పోలవరం నాశనం చేసిన జగన్ రెడ్డి.. గోదావరి జలాలను రైతులు వినియోగించుకోకుండా శాడిజం చూపించాడని ఆరోపించారు.
''కృష్ణా జలాల్లో మనం పట్టు కోల్పోతే, భవిష్యత్ ఎంతో ప్రమాదకరం ఉంటుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా శాశ్వత కరవు జిల్లాగా మిగిలిపోతుంది. నాపై కేసుల ఒత్తిళ్లకు లొంగి ఆడుతున్న జగన్నాటకంలో రాష్ట్ర రైతులు బలిపశువులు కావాలా..?. 30మందికి పైగా ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీలు రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. ఎందుకు మెడలు వంచుకుని ఉన్నారు. నదీ జలాల పంపిణీలో జగన్ స్వార్థ ప్రయోజనాలకు రైతులు బలికావాలా..?''- గొట్టిపాటి రవి కుమార్, అద్దంకి ఎమ్మెల్యే
Former PCC President Shailajanath on Krishna Jallas: కృష్ణా జలాల పంపిణీ వివాదంపై పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ స్పందించారు. ఇప్పటికే కరవుతో ఇబ్బందులు పడుతున్న అనంతపురం జిల్లా రైతులకు తీవ్రమైన అన్యాయం జరిగే పరిస్థితులు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రాల (ఏపీ, తెలంగాణ)కు 811 టీఎంసీలు నీరు వచ్చాయన్న ఆయన.. అందులో 299 టీఎంసీలు తెలంగాణ పోగా, మిగిలిన నీరు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఆ నీరే ప్రస్తుతం సరిపోక రాయలసీమ ప్రాంతం గొంతెండి పోయే పరిస్థితులు చూస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ జలాల కేటాయింపుల నిర్ణయం.. అనంతపురం రైతుకు చావు దెబ్బగా ప్రకటించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ కేంద్రం వద్ద మోకాళ్లు వంచింతే పనులు జరగవని ఎద్దేవా చేశారు. సాగునీరు ప్రాజెక్టులకు నీరొచ్చే పరిస్థితి లేదన్నారు. కృష్ణా జలాలను మొత్తం రాయలసీమ ప్రాంతానికి మళ్లించేలా జగన్ రెడ్డి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.