Kamareddy Bandh Today: రైతుల ఆందోళనతో కామారెడ్డి అట్టుడుకుతోంది. పట్టణ నూతన బృహత్ ప్రణాళికలోని పారిశ్రామిక జోన్‌లో సాగు భూములను చేర్చే ప్రతిపాదనను నిరసిస్తూ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లే క్రమంలో పలువురు అన్నదాతలు గాయపడ్డారు. ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ.. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఇవాళ కామారెడ్డి పట్టణ బంద్‌కు పిలుపునిచ్చింది.
Kamareddy Municipal Master Plan Issue Update : కామారెడ్డిలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్‌కు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు ప్రకటించాయి. వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా మూసి ఉంచారు. బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. బీజేపీ నేత వెంకటరమణారెడ్డిని అర్ధరాత్రి గృహ నిర్బంధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వెంటనే రద్దు చేయాలి : కామారెడ్డిలో రైతు బంద్‌కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. బంద్‌లో పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్‌పై ప్రజాక్షేత్రంలో సభలు జరిపి రైతులతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సమస్య జఠిలమైందని రేవంత్ ఆరోపించారు. న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
అసలు ఈ మాస్టర్ ప్లాన్ గొడవ ఏంటంటే..? రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ బృహత్ ప్రణాళికను దిల్లీకి చెందిన ఓ సంస్థతో ఇటీవల తయారు చేయించారు. కామారెడ్డి పట్టణంతో పాటు విలీన గ్రామాలైన అడ్లూర్, టెకిర్యాల్ , కాల్సిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వరపల్లిని కలుపుకుని 61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా తయారు చేశారు. మొత్తం పట్టణాన్ని ఇండస్ట్రియల్, గ్రీన్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లుగా విభజించి.. ఆ వివరాలను ఈ మధ్యే ప్రకటించారు.
2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు చెప్పారు. పారిశ్రామిక జోన్ కోసం 1200 ఎకరాలతో 8.5 శాతం ప్రతిపాదించారు. ఇందులో నేషనల్ హైవే పక్కన పచ్చని పంటలు పండే.. అడ్లూర్, ఇల్సిపూర్, టెకిర్యాల్, అడ్లూర్ ఎల్లారెడ్డి రైతులకు చెందిన 900 ఎకరాల భూములను చూపారు. దీనివల్ల ఈ భూములు రెసిడెన్షియల్ కింద పనికిరావని చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఈ భూములకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. భవిష్యత్‌లో ఇళ్ల నిర్మాణం కూడా కష్టమవుతుందని భావించిన రైతులు ఆందోళనబాట పట్టారు.
ఇవీ చదవండి: