YCP sarpanches fire on Government: గ్రామానికి ప్రథమ పౌరుడిగా ఉన్న సర్పంచ్‌లకు వైసీపీ ప్రభుత్వం విలువ లేకుండా చేసిందని సర్పంచ్‌లు అవేదన చెందుతున్నారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు వచ్చిన తర్వాత సర్పంచ్ అనే వారు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నేడు విజయవాడలో ఉమ్మడి కృష్ణ జిల్లా సర్పంచ్ సంఘం సదస్సు జరిగింది. ఈ సదస్సులో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సర్పంచ్‌లు పాల్గొని.. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. పంచాయితీలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా విద్యుత్ బకాయిల పేరుతో పంచాయతీలో ఉన్న నిధులు కూడా తీసుకోవాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. గతంలో 8 వేల 660 కోట్ల రూపాయల పంచాయతీ నిధులను ప్రభుత్వం తీసుకుందని తాము కేంద్రానికి ఫిర్యాదు చేశామని, ఇప్పుడు కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన 2 వేల 20 కోట్ల రూపాయలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సర్పంచ్‌లకు సంబంధించి న్యాయమైన 13 డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నామని తెలిపారు.
వైసీపీ తరుపున సర్పంచ్‌గా గెలిచి సిగ్గు పడుతున్నాము.. కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు ఇస్తున్న నిధలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం దారుణమని సర్పంచ్‌లు మండిపడుతున్నారు. సర్పంచ్‌లు తమ అవేదనను వివరిస్తూ.. వైసీపీ తరుపున సర్పంచ్‌గా గెలిచి తాము సిగ్గు పడుతున్నామని.. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చినాంపల్లె సర్పంచ్ రమేష్ వేదిక పైనే పాదరక్షతో చెంపలు వాయించుకుని ప్రభుత్వానికి తన నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్, సచివాలయ సిబ్బందికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటే ఇంకా తాము సర్పంచ్‌లుగా ఉండి ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిధుల లేమితో ఏ పని చేయలేక గ్రామస్తులకు ముఖం చూపించలేకపోతున్నామని వాపోతున్నారు.
వైసీపీ సర్పంచ్‌లు కూడా వ్యతిరేకతతో.. రాష్ట్రంలో సర్పంచులు, ప్రజలు చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధులైన వారే.. నేడు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. తామేదో వారికి న్యాయం చేస్తామని ప్రజలు తమను నమ్మి గెలిపించారని ఇప్పుడు వారికి ఏం చేయలేకుండా ఉన్నామని చెబుతున్నారు. 14,15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాల అభివృద్ది కోసమే వినియోగించాలని కానీ ఇలా ఇతర అవసరాలకు వాడుకోవడం సమంజసం కాదన్నారు. విపక్షాల సర్పంచ్‌లే కాకుండా వైసీపీ సర్పంచ్‌లు కూడా చాలా వ్యతిరేకతతో ఉన్నారని చెబుతున్నారు. బయటకు వచ్చి మాట్లాడితే మళ్లీ ప్రభుత్వం నుంచి వేధింపులు మొదలవుతాయని వారు భావిస్తున్నారని వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ది పనుల చేశామని ఇప్పుడు బిల్లులు రావడం లేదని వాపోతున్నారు
అవసరమైతే ఛలో దిల్లీ, లేదా ఛలో అమరావతి.. గతంలో సర్పంచ్ అంటే గౌరవం ఉండేదని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం సర్పంచ్ అర్థాన్ని, విలువను పూర్తిగా మార్చివేసిందని చెబుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నోకొబడిన తమకు వాలంటీర్‌కు ఉన్న గౌరవం కూడా లేదన్నారు. 1984 నుంచి పంచాతీయలకు ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నారని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పంచాయితీలకు విద్యుత్ బిల్లులు చెల్లించాలని చెప్పడం దుర్మార్గమన్నారు. స్థానిక సంస్థల పరిపుష్టికి చేయుతనివ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీలను డబ్బుల కోసం వేధించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వంపై పొరాటం చేసేందుకు సర్పంచ్‌లు సిద్దం అవుతున్నారు. తొలుత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వివిధ రూపాల్లో నిరసలను తెలియచేయాలని ప్రణాళికలు రుపొందిస్తున్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే అవసరమైతే ఛలో దిల్లీ, లేదా ఛలో అమరావతి చేపట్టేందుకు కూడా సిద్దమని వారు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి: